Dommaraju Gukesh | హంబర్గ్(జర్మనీ): ఫ్రీస్టయిల్ గ్రాండ్‌స్లామ్ టూర్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నాకౌట్ పోరుకు అర్హత సాధించాడు. మొత్తం తొమ్మిది రౌండ్ల పాటు సాగిన క్వాలిఫయర్స్‌లో గుకేశ్ ఏడు గేమ్‌లు డ్రా చేసుకోగా, రెండింటిలో ఓటమిపాలై ఎనిమిదో స్థానంలో నిలిచాడు. శనివారం నార్వే స్టార్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్తో జరిగిన గేమ్‌లో గుకేశ్ ఓటమిపాలయ్యాడు. కార్ల్సన్తో పోరులో పలుమార్లు గేమ్‌ను డ్రా చేసుకునేందుకు అవకాశమచ్చినా..గుకేశ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మొత్తంగా తొమ్మిది రౌండ్లలో గుకేశ్ 3.5పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. రౌండ్‌రాబిన్ ర్యాపిడ్ ఫార్మాట్లో జరిగిన టోర్నీలో అలీరెజా ఫిరౌజా, జావోకిర్ సిండ్రోవ్ 6.5 పాయింట్లతో టాప్‌లో నిలిచారు.
మాయా రాజేశ్వరన్ ఓటమి ; ముంబై డబ్ల్యూటీఏ ఓపెన్
ముంబై: ముంబై డబ్ల్యూటీఏ ఓపెన్‌లో భారత యువ ప్లేయర్ మాయా రాజేశ్వరన్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మాయా రాజేశ్వరన్ 3-6, 1-6తో జిల్ తిచ్మన్ చేతిలో ఓటమిపాలైంది. మనోజ్‌కుమార్ దగ్గర శిక్షణ పొందుతున్న రాజేశ్వరన్ వైల్డ్‌కార్డ్ ద్వారా టోర్నీలోకి ప్రవేశించింది. అసలు ఎలాంటి అంచనాలు లేకుం డా బరిలోకి దిగిన మాయా సెమీస్‌లో చుక్కెదురైంది. ప్రత్యర్థికి దీటైన పోటీనివ్వడంలో విఫలమైన ఈ 15 ఏండ్ల యువ ప్లేయర్ వరుస సెట్లలో ఓటమి చవిచూసింది. మరోవైపు మహిళల డబుల్స్‌లో ప్రార్థనా తాంబ్రె, అరియానె హర్టోనో జోడీ ఫైనల్లో తలపడనుంది.