అంటిగ్వా: వరుస విజయాలతో జోరుమీదున్న యువ భారత జట్టు.. అండర్-19 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యంగ్‌ఇండియా 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. గత ప్రపంచకప్ ఫైనల్లో బంగ్లా చేతిలో ఖంగుతిన్న యువ భారత్.. దానికి బదులు తీర్చుకుంటూ సెమీస్‌లో అడుగుపెట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 37.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. మెహెరూబ్ (30) టాప్ స్కోరర్ కాగా.. భారత బౌలర్లలో రవికుమార్ 3, విక్కీ ఓస్తాల్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం సునాయాస లక్ష్యఛేదనలో భారత్ 30.5 ఓవర్లలో 5 వికెట్లకు 117 పరుగులు చేసింది. రఘువంశీ (44), తెలుగు ఆటగాడు షేక్ రషీద్ (26) రాణించారు. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన యంగ్‌ఇండియా.. శనివారం పోరులోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మొదట బౌలింగ్‌లో ఆనక బ్యాటింగ్‌లో సత్తాచాటింది.