చెన్నై: ప్రతిష్టాత్మక చెన్నై చెస్ గ్రాండ్ మాస్టర్స్ టోర్నీలో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొమ్మిది రౌండ్లుగా సాగిన ఈ టోర్నీలో ఒకటి, మూడు రౌండ్లలో గెలిచిన అర్జున్.. ఆ తర్వాత తడబడి వరుసగా ఐదు డ్రాలు చేసుకోవడంతో టైటిల్ రేసులో వెనుకబడి అనీశ్ గిరి (నెదర్లాండ్స్)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఎనిమిదో రౌండ్ ముగిసేసరికే 6 పాయింట్లతో టైటిల్‌ను సొంతం చేసుకున్న విన్సెంట్ కీమర్.. శుక్రవారం జరిగిన 9వ రౌండ్లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ రే రాబ్సన్‌ను ఓడించి మొత్తంగా 7 పాయింట్లతో టోర్నీని ముగించాడు. ఈ టోర్నీలో అతడు ఐదు విజయాలు సాధించగా నాలుగు గేమ్స్‌ను డ్రా చేసుకున్నాడు. చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టైటిల్ నెగ్గడంతో విన్సెంట్.. వరల్డ్ ర్యాంకింగ్స్ (లైవ్ రేటింగ్స్)లో తొలిసారి టాప్-10లోకి దూసుకొచ్చాడు. అనీశ్.. వరుసగా 8 డ్రాలకు చెక్ పెడుతూ 9వ గేమ్‌లో తనదేశానికే చెందిన జోర్డెన్ వాన్ ఫోరీస్ట్ను ఓడించి రెండో స్థానానికి ఎగబాకాడు.