మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఓ యువ క్రికెటర్(Cricketer Dies) బంతి తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మెల్బోర్న్లో మంగళవారం జరిగింది. బెన్ ఆస్టిన్ అనే 17 ఏళ్ల కుర్రాడు స్థానిక టీ20 క్రికెట్ మ్యాచ్‌కు ప్రిపేరవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నెట్స్‌లో హెల్మెట్ పెట్టుకుని ఆటోమెటిక్ బౌలింగ్ మెషీన్ ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో.. బంతి బలంగా వచ్చి అతన్ని తగిలింది. తల, మెడ భాగంలో బంతి గట్టిగా తగిలినట్లు గుర్తించారు. క్రిటికల్ కండీషన్లో ఉన్న అతన్ని ఆస్పత్రికి తరలించినా.. అతని ప్రాణాలు దక్కలేదు. బెన్ మృతితో తీవ్ర విషాదం నెలకొన్నట్లు ఫెర్న్ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఆ క్లబ్ తరపున బౌలర్, బ్యాటర్‌గా బెన్ ఎదుగుతున్నాడు.
గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హుగ్స్ కూడా ఇలా బంతి తగలడం వల్లే మృతిచెందిన విషయం తెలిసిందే. 2014లో డొమెస్టిక్ క్రికెట్ షీఫీల్డ్ షీల్డ్ టోర్నీఆడుతున్న సమయంలో ఆ ఘటన జరిగింది. బంతి బలంగా మెడకు తగలగా అతను ప్రాణాలు విడిచాడు.