Year Ender 2024 | టీమిండియాతో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు 2024 సంవత్సరం చాలా ప్రత్యేకంగా నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని జట్టు మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ని నెగ్గింది. దాదాపు పది సంవత్సరాల తర్వాత మరోసారి కప్‌ని సాధించింది. ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేకేఆర్ జట్టు ఘన విజయం సాధించింది. కేకేఆర్ టైటిల్‌ని నెగ్గడంలో మెంటార్ గౌతమ్ గంభీర్ సైతం కీలక పాత్ర పోషించాడు. కేకేఆర్ చివరిసారిగా 2014లో విజేతగా నిలువగా.. మళ్లీ కప్ గెలిచేందుకు పదేళ్లు పట్టింది.
కోల్‌కతా నైట్రైడ్స్ ఇప్పటి వరకు మూడుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను నెగ్గింది. ఈ ఏడాదితో పాటు 2012, 2014లో ట్రోఫీని గెలిచింది. ఆ సమయంలో కేకేర్ జట్టు కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. గంభీర్ రిటైర్మెంట్ అనంతరం కేకేఆర్ టైలిల్‌ను గెలిచేందుకు చాలాకాలమే నిరీక్షించాల్సి వచ్చింది. కానీ, ఈ సీజన్లో కోల్‌కతా మెంటార్‌గా మారడంతో చాంఫియన్‌గా అవతరించింది. కోల్‌కతా జట్టు 2021 సీజన్లో ఫైనల్‌కు చేరినా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఓటమిపాలైంది.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రారంభం నుంచే లీగ్‌లో ఉన్నది. తొలిసారిగా టైటిల్‌ను నెగ్గేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది. 2011 సీజన్లో వేలంలో గంభీర్‌ను తీసుకొని కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఆ సీజన్లో కేకేఆర్‌లో చాలామంది ఆటగాళ్లు మారిపోయారు. గంభీర్ ఆ తర్వాత తనకు ఇష్టమైన రీతిలో టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జట్టు తొలిసారిగా ప్లే ఆఫ్‌కు చేరుకుంది. ఆ సీజన్లో కేకేఆర్ నాలుగో స్థానంలో నిలిచింది. 2012 సీజన్లో మరోసారి గంభీర్ నాయకత్వంలో జట్టు వచ్చింది. ఆ సీజన్లో గంభీర్ బ్యాట్‌తో రాణించాడు.
ఈ క్రమంలో జట్టు తొలిసారిగా ఫైనల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టైటిల్ మ్యాచ్‌లో కోల్‌కతా వరుసగా రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడింది. ధోనీ నేతృత్వంలోని సీఎస్కే నుంచి కోల్‌కతాకు గట్టి పోటీ ఎదురైంది. చెన్నై హోమ్‌గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌కు 191 పరుగుల లక్ష్యాన్ని చెన్నై నిర్దేశించింది. కోల్‌కతా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల కోల్పోయి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఇలా గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ తొలిసారి టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత 2014 సీజన్లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి రెండోసారి టైటిల్‌ను ఎగరేసుకొని పోయింది. ఆ సమయంలో జట్టు మెంటార్‌గా చేరి.. తొలి సీజన్లోనే కేకేఆర్‌కు మరో విజయాన్ని అందించాడు.
ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్‌ను కేకేఆర్ నెగ్గడంతో గంభీర్‌ను భారత జట్టు హెడ్ కోచ్ డిమాండ్ ఊపందుకున్నది. ఐపీఎల్ తర్వాత టీ20 ప్రపంచకప్ అమెరికా, వెస్టిండీస్ వేదికగా నిర్వహించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్‌ను టీమిండియా నెగ్గింది. వరల్డ్ కప్‌తో అప్పటి భారత జట్టు హెడ్‌కోచ్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ద్రవిడ్ స్థానంలో భారత జట్టు బాధ్యతలను గంభీర్‌కు అప్పగించింది. భారత జట్టుకు కోచ్‌గా మారడంతో కేకేఆర్‌తో గంభీర్ బంధానికి మళ్లీ బ్రేక్‌పడింది. టీమిండియా కోచ్‌గా మారడంతో కేకేఆర్ మెంటార్ పదవిని వదులుకోవాల్సి వచ్చింది.