Yashasvi Jaiswal : యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) భారత జట్టుకు ఆడాలన్న కలను నిజం చేసుకున్నాడు. ఈ ఎడమ చేతివాటం విధ్వంసక వెస్టిండీస్ పర్యటన(Westindies Tour)కు వెళ్తున్న టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. అయితే.. అతను క్రికెటర్‌గా మారే క్రమలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. పేదరికం కారణంగా తండ్రికి సాయంగా పానీపూరీ అమ్మిన రోజులు ఉన్నాయి. అలాంటిది అతను ఇప్పుడు ముంబైలో పెద్ద ఇల్లు కొన్నాడు. తాజాగా అతను తన సొంతిటి కలను ఎలా నిజం చేసుకున్నాడో చెప్పాడు.
‘ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కినప్పుడు నా మనసులో ఒకటే ఆలోచన ఉండేది. ఎలాగైనా సరే ముంబైలో మంచి ఇల్లు కొనాలి. ఎందుకంటే..? సొంతిల్లు లేక నేను ముంబైలో చాలా చోట్ల గడిపాను. అందుకని మంచి ఇల్లు కొని.. అందులోమా అమ్మానాన్న, తోబుట్టువులతో హాయింగా జీవించాలని అనుకున్నా. ఇంతకంటే పెద్ద కోరికలేవీ నాకు లేవు. భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకుంటున్నా’ అని యశస్వీ తెలిపాడు.
అండర్ -19 వరల్డ్ కప్(Under – 19 WC) యశస్వీ జీవితాన్ని మార్చేసింది. ఆ టోర్నీలో పరుగుల వరద పారించిన యశస్వీ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. 2020 మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) యశస్వీని రూ.2.40 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ యాజమాన్యం తనపై పెట్టకున్న నమ్మకాన్ని ఈ యంగ్‌స్టర్ నిలబెట్టుకున్నాడు. ధనాధన్ ఆటతో జట్టుకు శుభారంభాలు ఇచ్చాడు. దాంతో, ఈ యంగ్‌స్టర్‌ను 2022లో రాజస్థాన్ యాజమాన్యం రూ.4 కోట్లకు అట్టిపెట్టుకుంది.
యశస్వీ సెంచరీ అభివాదం
పదహారో సీజన్లో యశస్వీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 5 అర్ద శతకాలు, ఒక సెంచరీతో తన బ్యాట్ పవర్ చూపించాడు. అంతేకాదు ఐపీఎల్లో వేగవంతమైన ఫిఫ్టీతో కేఎల్ రాహుల్ రికార్డు బద్ధలు కొట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై యశస్వీ 16 బంతుల్లోనే యాభై రన్స్ చేశాడు. దాంతో, సెలెక్టర్లు అతడిని ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికచేశారు. అంతేకాదు విండీస్ టూర్‌కు కూడా ఈ యంగ్‌స్టర్‌ను తీసుకున్నారు. కరీబియన్ గడ్డపై టీమిండియా రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. మొదటి టెస్టు జూలై 12న మొదలుకానుంది.