టురిన్ : ఈ ఏడాది ప్రపంచ టెన్నిస్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన యువ సంచలనాలు కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్), యానిక్ సిన్నర్ (ఇటలీ) మధ్య జరిగిన ఏటీపీ ఫైనల్స్‌లో ఇటలీ కుర్రాడినే విజయం వరించింది. అభిమానులు ముద్దుగా ‘సిన్కరాజ్ రైవల్రీ’ (సిన్నర్, అల్కరాజ్) గా పిలుచుకుంటున్న వీరి పోరులో భాగంగా ఆదివారం రాత్రి ముగిసిన ఏటీపీ ఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన రెండో సీడ్ సిన్నర్.. 7-6 (7/4), 7-5తో స్పెయిన్ నయా బుల్‌ను ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు.
స్వంత అభిమానుల మద్దతు నడుమ హోరాహోరీగా సాగిన పోరులో వరుస సెట్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించిన సిన్నర్.. 2025 సీజన్ చివర్లో జరిగిన రసవత్తర పోరులో అల్కరాజ్పై పైచేయి సాధించాడు. ఈ ఏడాది ఈ ఇద్దరూ ముఖాముఖి ఎదురుపడటం ఆరోసారి కావడం విశేషం. ఇందులో మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ (ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్)తో పాటు మూడు టూర్ టోర్నీలున్నాయి. ఫ్రెంచ్ ఓపెన్‌లో అల్కరాజ్ నెగ్గితే వింబుల్డన్‌లో సిన్నర్ గెలిచి ప్రతీకారం తీర్చుకున్నాడు. అయితే యూఎస్ ఓపెన్‌లో అల్కరాజ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. తాజాగా సిన్నర్ ఆ ఓటమికి బదులు తీర్చుకోవడం గమనార్హం.