న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో భారత మహిళల టెన్నిస్ సవాల్‌ను తెలంగాణ అమ్మాయి, దేశ టాప్ ర్యాంక్ సింగిల్స్ ప్లేయర్ యమలపల్లి సహజ ముందుండి నడిపించనుంది. ఈ మెగా టోర్నీ కోసం ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) సోమవారం ప్రకటించిన ఆరుగురు సభ్యుల మహిళల జట్టుకు సహజ ఎంపికైంది. ప్రస్తుతం ప్రపంచ 332వ ర్యాంకులో సహజ ప్రస్తుత ఫామ్‌ను పరిగణనలోకి తీసుకున్న సెలెక్షన్ కమిటీ, ఆమెకు జట్టును నడిపించే బాధ్యతలను అప్పగించింది. వైష్ణవి అడ్కర్ (396వ ర్యాంక్), వైదేహి చౌదరి (417), రుతుజా భోసలే (125), ప్రార్థన తోంబరే(181), అంకిత రైనా (185) జట్టులో స్థానం సంపాదించారు. పురుషుల జట్టును ప్రపంచ 277వ ర్యాంకర్ సుమిత్ నగాల్ నడిపించనున్నాడు. సింగిల్స్‌లో నగాల్‌తో పాటు మానస్ ధామ్నే, దక్షిణేశ్వర్ సురేష్ ఎంపికవగా.. డబుల్స్ స్పెషలిస్టులుగా యూకీ బాంబ్రీ, శ్రీరామ్ బాలాజీ, అనిరుధ్ చంద్రశేఖర్‌ను ఏఐటీఏ ఎంపిక చేసింది. కరణ్ సింగ్, రిత్విక్ బొల్లిపల్లి, నిక్కీ పూనాచా రిజర్వ్ ప్లేయర్లుగా ఉంటారు.