WTC Points Table | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌లో భారత జట్టు 184 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్‌కు చేరాలన్న భారత జట్టు అవకాశాలపై దెబ్బ కొట్టింది. ఇప్పటికీ ఫైనల్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నా.. అంత తేలిగ్గా మాత్రం కుదరదు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఓటమి తర్వాత WTC పాయింట్ల పట్టికలో భారతదేశం మూడో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉన్నది. దక్షిణాఫ్రికా జట్టు పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం కేవలం రెండోస్థానం కోసం మాత్రమే పోరు కొనసాగనున్నది. ప్రస్తుతం ఫైనల్‌కు చేరేందుక ఆస్ట్రేలియా జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన టీమిండియాకు మూడోసారి ఫైనల్ ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. మెల్బోర్న్ టెస్టులో 340 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగులకు కుప్పకూలింది.
భారత బ్యాటర్లు మూడు సెషన్లలో ఆసిస్ బౌలర్లను దీటుగా ఎదుర్కోలేకపోయారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత మెల్బోర్న్లో టీమిండియా టెస్టులో ఓడిపోయింది. ఇంతకు ముందు 2011లో చివరిసారిగా ఓడింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరుగనున్నది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు టీమిండియా.. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడగా.. ఓటమిపాలైంది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్, అడిలైడ్ టెస్టులో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. బ్రిస్బేన్ టెస్ట్ డ్రాగా ముగియగా.. మెల్బోర్న్ టెస్టులో ఓటమితో భారత్ 1-2 తేడాతో వెనుకంజలో ఉన్నది. ఈ క్రమంలో భారత్ ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడాల్సి పరిస్థితి ఎదుర్కొంది.
సిడ్నీలో జరిగే టెస్టులో తప్పనిసరిగా విజయం సాధించాల్సిందే. మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా.. ఓడిపోయినా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోహిత్ కెప్టెన్సీలో గత రెండునెలల్లో ఆడిన ఆరు టెస్టుల్లో టీమిండియాకు ఇది ఐదో టెస్ట్ ఓటమి. న్యూజిలాండ్‌పై వైట్‌వాష్‌కు గురవగా.. అడిలైడ్, మెల్బోర్న్ టెస్టుల్లోనూ ఓటమిపాలైంది. WTC ఫైనల్ భారత్ ఆశలు సజీవంగా ఉండాలంటే సిడ్నీ టెస్టులో ఎలాగైనా గెలవాల్సిందే. ఐదో టెస్టులో భారత్ గెలిస్తే సిరీస్ 2-2తో సమం అవుతుంది. ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు.. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఆసిస్‌ను శ్రీలంక ఓడిస్తే.. కంగారు జట్టుకు ఇబ్బందికరంగా మారింది. బోర్డర్ ట్రోఫీని డ్రా చేసుకుంటే.. భారత్ 55.26 పాయింట్లతో ఉంటే.. శ్రీలంకపై ఓటమితో ఆస్ట్రేలియా పాయింట్లు 54.26గా మారుతాయి. అయితే, ఆస్ట్రేలియా.. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగిస్తే 56.48 పాయింట్లతో ఆస్ట్రేలియా ఫైనల్ చేరుకని భారత్ రేసు నుంచి తప్పుకుంటుంది.