Wrestlers Protest | భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగుతున్నది. 2016 రియో ఒలిపింక్స్ కాంస్య పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్ బ్రిజ్ భూషణ్‌కు సవాల్ విసిరింది. నార్కో టెస్ట్ చేయించుకొని.. తాను నిర్దోషి అని నిరూపించుకోవాలని డిమాండ్ చేసింది. ఏడుగురు రెజర్ల లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ తాను నిర్దోషి అని అనుకుంటే లైడిటెక్టర్ నార్కో టెస్ట్ చేయించుకోవాలని సవాల్ విసిరింది.
విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎవరు దోషి.. ఎవరు నిర్దోషి అన్నది బయటకు రావాలని స్పష్టం చేసింది. 2021 టోక్యో ఒలిపింక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా మాట్లాడుతూ ఐఓఏ తాత్కాలిక ప్యానెల్లో అన్ని పోటీలు జరుగాలని తాము కోరుకుంటున్నామన్నారు. బ్రిజ్ భూషణ్ రెజ్లింగ్ ఫెడరేషన్లో కొనసాగితే.. పోటీలను నిర్వహించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. బ్రిజ్ భూషన్‌పై విచారణ నెమ్మదించడంపై రెజర్లరు తీవ్రంగా నిరసించారు.
ఇదిలా ఉండగా.. మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లను లైంగిక వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలున్నాయి. ఆయనను అరెస్టు చేయాలని మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. ఏప్రిల్ 28న రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్‌పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే, ఇప్పటి వరకు మాత్రం విచారించలేదు. దీనిపై సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను మందలించింది.