WPL Auction : బీసీసీఐ తొలి సారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. రేపు ముంబైలో వేలం ప్రారంభం కానుంది. ఇంతకు ఈ వేలాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో తెలుసా..? మలికా అద్వానీ అనే మహిళ. దాంతో, డబ్ల్యూపీఎల్ వేలం నిర్వహించిన తొలి మహిళగా మలికా గుర్తింపు సాధించనుంది. ముంబైకి చెందిన మలికాకు పురాతన పెయింటింగ్స్, శిల్పాలను సేకరించడమంటే చాలా ఇష్టం. మధ్య భారతదేశం, ఆధునిక భారత దేశానికి సంబంధించిన పెయింటింగ్స్‌ను మలికా ఎక్కువగా కలెక్ట్ చేస్తుంటుంది. ఆమె ప్రస్తుతం ఆర్ట్ ఇండియా కన్సల్టంట్స్ కంపెనీలో పనిచేస్తోంది.
బ్రిటన్‌కు చెందిన హగ్ ఎడ్మియడెస్, ఇంగ్లండ్ టీవీ ప్రజెంటర్ రిచర్డ్ మడ్లే, భారత కామెంటేటర్ చారు శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం నిర్వహించారు. అయితే.. ఇంతవరకు ఐపీఎల్ వేలాన్ని మహిళలు నిర్వహించలేదు. అలాంటిది డబ్ల్యూపీఎల్ వేలం పాట పాడే అవకాశం మలికా అద్వానీకి రావడం విశేషం. ఫిబ్రవరి 13న డబ్ల్యూపీఎల్ వేలం జరగనుంది. ముంబై వేదికగా మర్చి 4న మహిళల ప్రీమియర్ లీగ్ మొదలు కానుంది. ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడతాయి. మార్చి 22న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఐదు ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు వేలంలో ఉన్నారు. అయితే.. 90 స్లాట్స్ మాత్రమే ఖాళీ ఉన్నాయి. వేలంలో స్టార్ ప్లేయర్స్‌కు భారీ ధర దక్కే అవకాశం ఉంది. వేలంలో పాల్గొంటున్న వాళ్లలో 24 మంది రూ. 50 లక్షల కనీస ధరకు ఎంపికయ్యారు. 30 మంది ప్లేయర్స్ రూ.40 లక్షల బేస్ ప్రైజ్‌కు పేర్లు రిజిష్టర్ చేసుకున్నారు.
రూ. 50 లక్షల జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధానా, దీప్తి శర్మ, షఫాలీ వర్మ వంటి భారత క్రికెటర్లు ఉన్నారు. 13 మంది విదేశీ క్రికెటర్లు కూడా రూ.50 లక్షలకు తమ పేరు రిజిష్టర్ చేసుకున్నారు. వాళ్లు ఎవరంటే.. ఎల్లిసే పెర్రీ(ఆస్ట్రేలియా) , సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), సోఫీ డెవినె (న్యూజిలాండ్), డియాండ్ర డొటిన్ (వెస్టిండీస్).