WPL 2024, UP vs RCB | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో భాగంగా యూపీ వారియర్స్‌తో కీలక మ్యాచ్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తూ అదరగొట్టింది. ఆర్సీబీ సారథి స్మృతి మంధాన (50 బంతుల్లో 80, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విజృంభణతో పాటు ఎల్లీస్ పెర్రీ (37 బంతుల్లో 58, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగుల భారీ స్కోరు చేసింది. యూపీ బౌలర్లు ఆర్సీబీని కట్టడి చేయడంలో విఫలమయ్యారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఓపెనర్లు హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ అందించారు. ఓపెనర్ సబ్బినేని మేఘన (21 బంతుల్లో 28, 5 ఫోర్లు), మంధానలు ఆది నుంచే దూకుడుగా ఆడారు. ఈ ఇద్దరూ ధాటిగా ఆడటంతో 5.2 ఓవర్లకే ఆర్సీబీ స్కోరు 50 పరుగులు దాటింది. అయితే మేఘనను అంజలి సర్వని ఔట్ చేయడంతో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది.
మంధాన ఫిఫ్టీ..
వన్ డౌన్లో వచ్చిన ఎల్లీస్ పెర్రీతో జతకలిసిన మంధాన.. దూకుడను కొనసాగించింది. ఆటపట్టు వేసిన 9 వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన 12వ ఓవర్లో పెర్రీ ఫోర్ కొట్టగా మంధాన సిక్సర్ బాదడంతో ఆర్సీబీ స్కోరు వంద పరుగులు దాటింది. గ్రేస్ హరీస్ వేసిన 13వ ఓవర్లో తొలి బంతికి మంధాన సింగిల్ తీసి 34 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసింది. హాఫ్ సెంచరీ తర్వాత ఆమె జోరు పెంచింది. ఆటపట్టు వేసిన 15వ ఓవర్లో మూడు బౌండరీలు సాధించింది. అంజలి వేసిన మరుసటి ఓవర్లోనూ మూడు ఫోర్లు బాదింది. కానీ దీప్తి శర్మ వేసిన 17వ ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ ఆడబోయి డీప్ మిడ్ వికెట్ వద్ద పూనమ్ ఖేమ్నర్కు క్యాచ్ ఇచ్చింది.
Batting carnage in Bengaluru 💥
Captain Smriti Mandhana and Ellyse Perry power @RCBTweets to 198/3
Do we have a high-scoring thriller on the cards ❓
Find out 🔜
Scorecard 💻📱https://t.co/iplAqFh4Yz#TATAWPL | #UPWvRCB pic.twitter.com/tiFhDB2uG5
— Women’s Premier League (WPL) (@wplt20) March 4, 2024
పెర్రీ బాదుడు..
మంధాన నిష్క్రమించినా స్కోరును పెంచే బాధ్యతను పెర్రీ తీసుకుంది. గైక్వాడ్ వేసిన 18వ ఓవర్లో ఆమె రెండు సిక్సర్లు బాదగా రిచా ఘోష్ (10 బంతుల్లో 21 నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఓ సిక్సర్ కొట్టడంతో ఈ ఓవర్లో మొత్తంగా 21 పరుగులొచ్చాయి. దీప్తి వేసిన 19వ ఓవర్లో మూడో బంతిని బౌండరీకి పంపడంతో పెర్రీ అర్థ సెంచరీ పూర్తయింది. హాఫ్ సెంచరీ అయ్యాక సిక్సర్ కొట్టిన ఆమె.. ఆఖరి ఓవర్ తొలి బంతికే ఔటైంది.