WPL 2024, GG vs UP | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో మరో ఉత్కంఠకరమైన ముగింపు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో యూపీ వారియర్స్ ఛేదనలో తడబడింది. మొదట బ్యాటింగ్ చేసి గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 153 పరుగుల ఛేదనలో యూపీ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఛేదనలో ఆ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 144 పరుగుల వద్దే ఆగిపోయింది. ఫలితంగా గుజరాత్.. 8 రన్స్ తేడాతో గెలిచింది. యూపీ ఆల్రౌండర్ దీప్తి శర్మ (60 బంతుల్లో 88 నాటౌట్, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసింది. పూనమ్ ఖేమ్నర్ (36 బంతుల్లో 36 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్సర్) లు బాధ్యతాయుతంగా ఆడింది. ఆరంభంలో వికెట్లు కోల్పోయి నెమ్మదిగా ఆడగా ఆఖర్లో భారీ ఛేదనలో యూపీ బ్యాటర్లు టార్గెట్ను ఛేదించలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో షబ్నమ్ షకీల్ నాలుగు ఓవర్లలో 11 పరుగులే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టింది. ఈ ఓటమితో యూపీ కథ ముగియగా ఆర్సీబీకి లైన్ క్లీయర్ అయింది.
మోస్తారు లక్ష్య ఛేదనలో యూపీకి ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. గుజరాత్ పేసర్ షబ్నమ్ షకీల్ యూపీని మొదట్లోనే చావుదెబ్బ తీసింది. ఆమె వేసిన తొలి ఓవర్లోనే యూపీ సారథి అలిస్సా హీలి (4), చమరి ఆటపట్టు (0) లు పెవిలియన్ చేరారు. రెండో ఓవర్లోనే మరో ఓపెనర్ కిరణ్ నవ్గిరె కూడా క్యాథ్రిన్ బ్రైస్ బౌలింగ్లో షబ్నమ్కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. యూపీ భారీ ఆశలు పెట్టుకున్న గ్రేస్ హరీస్ (1), శ్వేతా సెహ్రావత్ (8)లు కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు. శ్వేతా వికెట్ కూడా షబ్నమ్కే దక్కింది. ఏడు ఓవర్లు ముగిసేసరికి యూపీ 5 వికెట్లు కోల్పోయి 35 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న దీప్తి – ఖేమ్నర్
35 రన్స్కే సగం వికెట్లు కోల్పోయిన యూపీని దీప్తి శర్మ ఆదుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలతో క్రీజులో నిలిచిన ఆమె.. ఏడో స్థానంలో వచ్చిన పూనమ్ ఖేమ్నర్ తో కలిసి ఆరో వికెట్కు ?? విలువైన భాగస్వామ్యం జోడించింది. ఈ ఇద్దరు నిలవడంతోనే యూపీ ఆ మాత్రం స్కోరు అయినా సాధించగలిగింది. 44 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న దీప్తికి ఇది వరుసగా మూడో ఫిఫ్టీ కావడం విశేషం.
ఆఖరి నాలుగు ఓవర్లలో 55 పరుగులు చేయాల్సి ఉండగా మన్నత్ కశ్యప్ వేసిన 17వ ఓవర్లో 12 పరుగులు రాగా మేఘనా సింగ్ ఓవర్లో 3 పరుగులే వచ్చాయి. తనూజా కన్వర్ వేసిన 19వ ఓవర్లో 14 రన్స్ వచ్చినా ఆఖరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 26 పరుగులు అవసరమయ్యాయి. కానీ చివరి ఆరు బంతుల్లో యూపీ.. 17 మాత్రమే చేయగలిగింది. ఫలితంగా గుజరాత్ 8 రన్స్ తేడాతో విజయం సాధించింది.