WPL 2024 | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు రెచ్చిపోయారు. ఆ జట్టు ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ ఆరు వికెట్ల (6/15) తో చెలరేగడంతో ముంబై ఇండియన్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 19 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌట్ అయింది. పెర్రీ ధాటికి ఒక దశలో 64-1గా ఉన్న ముంబై ఇండియన్స్.. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికీ 82-7గా మారింది. 5 ఓవర్ల వ్యవధిలో ముంబై ఆరు వికెట్లు కోల్పోయింది. పెర్రీ వరుస ఓవర్లలో ముంబైని నిండా ముంచింది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ముంబైకి శుభారంభమే దక్కింది. యస్తికా భాటియాకు విశ్రాంతినిచ్చి సజనను ఓపెనర్‌గా పంపి ముంబై ప్రయోగం చేసింది. మాథ్యూస్ (26), సజన (30)లు కలిసి తొలి వికెట్‌కు 5.6 ఓవర్లలో 43 పరగులు జోడించారు. సోఫీ డివైన్ ఆర్సీబీకి తొలి బ్రేక్ ఇచ్చింది.
పెర్రీ సిక్సర్…
9వ ఓవర్ ప్రారంభమయ్యేటప్పటికీ 60-1గా ఉన్న ముంబైకి పెర్రీ వరుస ఓవర్లలో షాకులిచ్చింది. ఆమె వేసిన తొమ్మిదో ఓవర్లో నాలుగో బంతికి సజన బౌల్డ్ అయింది. తర్వాతి బంతికే హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా డకౌట్ అయింది. పెర్రీ 11వ ఓవర్లో మొదటి బంతికే అమెలియా కెర్ (2)ను ఎల్బీగా వెనక్కిపంపగా మూడో బంతికి అమన్‌జ్యోత్ కౌర్ (4) ను బౌల్డ్ చేసింది. 13వ ఓవర్లో పూజా వస్త్రకార్ (6), నటాలీ సీవర్ బ్రంట్ (10) లు పెవిలియన్ చేరారు. డబ్ల్యూపీఎల్‌లో తొలిసారి ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన ఆమె.. ఈ లీగ్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో తొలి 9 బంతుల్లో ఒక్క వికెట్ కూడా తీయని పెర్రీ.. తర్వాతి 15 బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టింది. ఇందులో నలుగురు బౌల్డ్ అవగా ఇద్దరు ఎల్బీగా వెనుదిరిగారు.
Ellyse Perry Show at Delhi’s Arun Jaitley Stadium tonight#CricketTwitter #WPL2024 #MIvRCB pic.twitter.com/vfE8nRJYgb
— Female Cricket (@imfemalecricket) March 12, 2024
ఆఖర్లో ప్రియాంక బాలా (19) కాస్త నిలదొక్కుకోవడంతో ముంబై స్కోరు వంద పరుగులు దాటింది. మరి బౌలింగ్‌లో రాణించిన ఆర్సీబీ.. బ్యాటింగ్‌లో ఏ మేరకు సక్సెస్ అవుతుందో..!