న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో తాను ఉండి ఉంటే పెండ్లి చేసుకునే వాడినే కాదని పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ క్రికెట్ ప్లేయర్ సోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. వివాహం తాలూకూ ఒత్తిళ్లే కోహ్లీ ఆటతీరును తీవ్రంగా ప్రభావితం చేశాయని అన్నారు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఆడుతున్న అక్తర్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పటికే టీ20, వన్డే జట్ల కెప్టెన్సీల నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీ తాజాగా టెస్ట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. కోహ్లీపై అక్తర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 33 ఏండ్ల విరాట్ కోహ్లీని తాను ఏనాడు కెప్టెన్‌గా చూడాలనుకోలేదని, కెప్టెన్‌గా కంటే అతను ఒక బ్యాట్స్‌మెన్‌గా 100, 120 పరుగుల స్కోర్ చేయాలని కోరుకునేవాడినని అక్తర్ చెప్పాడు.
అయితే కోహ్లీ పెండ్లి చేసుకోవడాన్ని తాను తప్పుపట్టడంలేదని, కానీ మరో 10 నుంచి 12 ఏండ్లు ఆటపై దృష్టిపెట్టి ఆ తర్వాత పెండ్లి చేసుకుని ఉంటే బాగుండేదన్నది తన అభిప్రాయమని షోయబ్ అక్తర్ తెలిపాడు. తాను కోహ్లీ స్థానంలో ఉంటే అదే చేసివాడినని అన్నారు. అదేవిధంగా దాదాపు 6-7 ఏండ్లు జట్టు సారథ్య బాధ్యతలు నిర్వహించిన కోహ్లీ తనకు తానుగా కెప్టెన్సీ నుంచి తప్పుకోలేదని, తనను బలవంతంగా తప్పుకునేలా చేశారని అక్తర్ వ్యాఖ్యానించాడు.