చెంగ్డు(చైనా) : ప్రతిష్టాత్మక వరల్డ్ గేమ్స్‌లో భారత యువ ఆర్చర్ రిశబ్ యాదవ్ కాంస్య పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో బరిలోకి దిగిన రిశబ్ 149-147తో భారత్‌కే చెందిన అభిషేక్ వర్మపై అద్భుత విజయం సాధించాడు. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో ఆఖరికి రిశబ్నే విజయం వరించింది. పదో సీడ్‌గా పోటీపడ్డ రిశబ్ అద్భుత పరిణతి కనబరిచాడు. తొలి సెట్లో మూడు సార్లు 10 పాయింట్లు ఖాతాలో వేసుకున్న రిశబ్ 30-29తో వర్మపై ఆధిక్యంలో నిలిచాడు. రెండో సెట్లో ఇద్దరి మధ్య స్కోరు 29-29తో సమమైంది. స్వల్ప ఆధిక్యంతో మూడో సెట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఆర్చర్లు అత్యంత కచ్చితత్వంతో బాణాలు సంధించడంతో పదేసి పాయింట్లు దక్కాయి. నాలుగో సెట్ ముగిసే సరికి రిశబ్ 119-117 ఆధిక్యం కనబరిచాడు. పోరు జరుగుతున్నంతసేపు చెదరని ఏకాగ్రత కనబరిచిన ఈ యువ ఆర్చర్ మరోమారు మూడు సార్లు పదేసి పాయింట్లు కొల్లగొట్టాడు.
తన ఆఖరి తొమ్మిది బాణాల్లో చెక్కుచెదరని గురితో విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో యాదవ్ 145-147తో కర్టిస్ లీ బ్రాండ్నాక్స్(అమెరికా)చేతిలో ఓడగా, అభిషేక్‌వర్మ 145-148తో టాప్‌సీడ్ మైక్ సోలెస్సర్(నెదర్లాండ్)పై పరాజయం ఎదుర్కొన్నాడు. మరోవైపు మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో భారత పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. 12వ సీడ్ పర్నీత్‌కౌర్ 140-145తో అలెగ్జాండ్రా ఉస్కినో(కొలంబియా)పై ఓటమి పాలైంది. మూడోసీడ్ మధుర 145-149తో లిసెల్ జట్మా(ఈస్తోనియా)పై ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిక్స్డ్ కాంపౌండ్ ఈవెంట్లో భారత ద్వయం అభిషేక్‌వర్మ, మధుర 151-154తో దక్షిణకొరియా జోడీ మూన్ యున్, లీ ఎన్హో చేతిలో ఓడి తమ పోరాటం ముగించింది. మొత్తంగా రిశబ్ మినహా భారత కాంపౌండ్ ఆర్చర్లు విఫలం కాగా, రికర్వ్ విభాగంలో ఎవరూ పోటీపడటం లేదు.