World Cup Final 2023 : వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు రేపు మధ్యాహ్యం తెరలేవనుంది. మెగా టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత్(India), ఆస్ట్రేలియా(Auastralia) టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. దాంతో, అహ్మదాబాద్ (Ahmedabad)లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేస్తే బెటరా? ఎన్ని పరుగులు చేస్తే డిఫెండ్ చేయొచ్చు? అనే చర్చలు ఊపందుకున్నాయి. ఇదే విషయంపై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ పిచ్ క్యూరేటర్(Curator) ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అహ్మదాబాద్ పిచ్‌పై 315 పరుగులు చేస్తే బేఫికర్‌గా ఉండొచ్చని ఆయన అన్నాడు. ‘ఒకవేళ భారీ రోలర్‌ను ఉపయోగించి ఆ తర్వాత పిచ్‌పై నల్లమట్టిని చల్లారనుకోండి.. పిచ్ స్లోగా ఉంటుంది. భారీ స్కోర్లకు అవకాశం లేకపోలేదు. అయితే.. ప్రతి బంతిని హిట్ చేయడం సాధ్యపడదు. అప్పుడు 315 స్కోర్ చేసినా డిఫెండ్ చేయొచ్చు’ అని సదరు క్యూరేటర్ తెలిపాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడడం ఇది రెండోసారి. 2003లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆసీస్ పైచేయి సాధించింది. ఈసారి భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ సేన 20 ఏండ్ల క్రితం ఓటమికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది.
రోహిత్ శర్మ VS పాట్ కమిన్స్
ఈసారి వరల్డ్ కప్‌లో అహ్మదాబాద్‌లో అత్యధిక స్కోర్ 283. అది కూడా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కొట్టింది. లీగ్ దశలో భారత జట్టు దాయాది పాకిస్థాన్‌తో అహ్మదాబాద్‌లో తలపడినప్పటికీ మొదట బ్యాటింగ్ చేసే చాన్స్ రాలేదు. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగడంతో పాక్ 191 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని రోహిత్ సేన ఆడుతూ పాడుతూ 30.3 ఓవర్లలో చేధించింది. ఇదే పిచ్‌పై ఆస్ట్రేలియా 33 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 296 పరుగులకే పరమితమైనా.. ఆడం జంపా (3 వికెట్లు) విజృంభించడంతో బట్లర్ సేనను 253కే కట్టడి చేసింది.