Congress | ‘మహాభారతంలో లేని పాత్ర లేదంటారు. వెయ్యి పాత్రలు ఉన్నాయట. ఒక్కో పాత్ర మనస్తత్వం ఒక్కో రకంగా ఉంటుంది కదా?’
‘అవును… నాకైతే శకుని కళ్ల ముందు కనిపిస్తున్నట్టుగా ఉంది’
‘ఎవరిని చూస్తే?’
‘ఇంకెవరిని… హస్తం పొట్టయ్యను చూస్తే …’
‘ఆయన భస్మాసురుడి టైప్ అనుకుంటానే. కాదా.. ’
‘భస్మాసురుడు తన నెత్తిమీద తానే చేయి పెట్టుకొని భస్మం అయ్యాడు. కానీ, ఈయన తన తలమీద తానుచెయ్యి పెట్టుకొని భస్మం కాలేదు. తనను దగ్గరకు తీసిన సైకిల్‌ను భస్మం చేశాడు. ఇప్పుడు చెయ్యిని భస్మం చేసే పనిలో ఉన్నాడు. కాబట్టి భస్మాసురుడితో పోలిక లేదు.’
‘ఎవరో చెబితే విన్నాను. మహాభారతంలో అన్నిరకాల పాత్రలు ఉన్నాయి, బాబును పోలిన పాత్ర లేదు అని…’
‘అవును బాబును పోలిన పాత్ర లేదు. కానీ, బాబు శిష్యుడిని పోలిన పాత్ర ఉంది. అదే శకుని…’
‘తెలుసు. శకుని అంటే ధూళిపాళే కదా? ఆయన పొట్టిగా ఉండేవాడా?’
‘ముందు ఆ నెట్ మూసెయ్. శకుని ఎవరో నీకు తెలియదు. నెట్లో వెతికితే ధూళిపాళనే చూపుతుంది. అయినా ఇక్కడ నేను పోల్చి చెబుతున్నది మానసికమైన కురచదనం గురించి’
‘అర్థం అయ్యేట్టు చెప్పు?’
‘కౌరవులను సర్వనాశనం చేయాలని శకుని ఆశయం. అతనికా… అంత శక్తి లేదు. మరేం చేయాలి. అందుకే, మంచి కోరుతున్నట్టు వాళ్ల వెంటే ఉండి, నాశనం చేయడం సులభం అనుకున్నాడు. తన వ్యూహంలో విజయం సాధించాడు కూడా. అదే దారిలో ఇప్పుడు పొట్టయ్య. మొదట సైకిల్ తుక్కు తుక్కు అయింది. హస్తాన్ని అదే దారి పట్టించాలని ప్రయత్నం. అందుకే నిత్యం… పిండాలు, తొక్కడాలు, చంపడాల్లాంటి వినాశనకరమైన మాటలే మాట్లాడుతున్నాడు.’
‘దీనితో ఏమవుతుంది?’
‘సామాన్య ప్రజలు పెంటపాటి పుల్లారావులా నిత్యం టీవీలో కూర్చొని అన్నింటిపై తమ అభిప్రాయాలు చెప్పరు. ఎన్నికల్లో గుద్ది చూపిస్తారు. బూతులకు ఓటుతో సమాధానం చెబుతారు’
‘శకునిలా హస్తాన్ని నాశనం చేస్తే ఏమొస్తుంది?’
‘ఏమో… సైకిల్లానే హస్తాన్ని కూడా తుక్కు తుక్కు చేసి ఇంట్లో నుంచి బయటపడి, హస్తంలో రెండు చేతులా సంపాదించిన దానితో సొంత పార్టీ ఆలోచన కావచ్చు’
‘పిండాల మాటల్లో అంత ప్లాన్ ఉందా?’
‘దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌ను రద్దు చేయాలి… అని మహాత్మా గాంధీ కోరారు. అప్పటి నేతలు ఆయన మాట వినలేదు. కానీ, ప్రస్తుతం పిండారీలు అదే పనిలో ఉన్నట్టు అనిపిస్తున్నది.’
– మురళి