న్యూఢిల్లీ: లివర్‌పూల్ వేదికగా ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ టోర్నీకి గురువారం తెరలేవనుంది. ఈనెల 14వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి స్టార్ బాక్సర్లు బరిలోకి దిగుతున్నారు. ఇటీవల బ్రెజిల్, కజకిస్థాన్‌లో జరిగిన వేర్వేరు వరల్డ్ బాక్సింగ్ కప్ టోర్నీల్లో 17 పతకాలతో సత్తాచాటిన భారత బాక్సర్లు అదరగొట్టాలని చూస్తున్నారు. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్(51కి)తో పాటు ఒలింపిక్ కాంస్య విజేత లవ్లీనా బొర్గోహై(75కి) తమ పంచ్ పవర్ చూపెట్టేందుకు సై అంటున్నారు. వీరికి తోడు హితేశ్(70కి), అభినాశ్(65కి), నుపూర్(80కి), పూజరాణి(80కి), మీనాక్షి(48కి), సాక్షి(54కి), జాస్మిన్(57కి), సంజు(60కి), సనామచా చాను(70కి) పోటీకి దిగుతున్నారు.
భారత్, కొరియా పోరు డ్రా
రాజ్‌గిర్(బీహార్): ప్రతిష్టాత్మక ఆసియా కప్ హాకీలో భారత్ మెరుగైన ప్రదర్శన కొనసాగుతున్నది. ప్రపంచకప్ టోర్నీ బెర్తు దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న భారత్ అందుకు తగ్గట్లు ముందుకు సాగుతున్నది. బుధవారం టీమ్ఇండియా, కొరియా మధ్య సూపర్-4 పోరు 2-2తో డ్రాగా ముగిసింది. మూడో క్వార్టర్ వరకు 1-2తో వెనుకంజలో కొనసాగిన భారత్..ఆఖరిదైన నాలుగో క్వార్టర్లో అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భారత్ తరఫున హార్దిక్సింగ్(7ని), మన్‌దీప్‌సింగ్(52ని) ఒక్కో గోల్ చేశారు. మరోవైపు కొరియాకు జిహున్ యాంగ్ (11ని), కిమ్ యుహాన్ హాంగ్(13ని) గోల్స్ అందించారు. ఈ డ్రాతో భారత్ ప్రస్తుతం ఒక పాయింట్‌తో రెండో స్థానంలో ఉంది.