మెడల్ సాధించి పెట్టిన నిఖత్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ. తన వరుస విజయాలతో దేశఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు.
-సీఎం కేసీఆర్
అద్భుతం ఆవిష్కృతమైంది. భారత బాక్సింగ్ చరిత్రలో మరుపురాని రోజు. ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు దుమ్మురేపారు. సొంత ఇలాఖాలో ప్రత్యర్థులపై తమ పదునైన పంచ్‌లతో విరుచుకుపడుతూ పసిడి వెలుగులు విరజిమ్మారు. తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ తన పంచ్పవర్కు తిరుగులేదని నిరూపిస్తూ స్వర్ణకాంతులు వెదజల్లింది. హోరాహోరీగా సాగిన పోరులో వియత్నాం బాక్సర్‌ను చిత్తుచేస్తూ వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. తెలంగాణ ఖ్యాతిని మరోమారు ఇనుమడింపజేస్తూ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది. నిఖత్‌కు తోడు లవ్లీనా బొర్గోహై పసిడి దక్కించుకోగా, నాలుగు స్వర్ణాలతో భారత్.. మెగాటోర్నీని ఘనంగా ముగించింది.
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు కొత్త చరిత్ర లిఖించారు. ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్లకు సవాలు విసురుతూ యువ బాక్సర్లు నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై పసిడి పతకాలతో మెరిశారు. ఆదివారం జరిగిన వేర్వేరు బౌట్లలో అద్భుత విజయాలు సాధించిన నిఖత్, లవ్లీనా తమ సత్తాచాటారు. తొలుత జరిగిన 50కిలోల తుది పోరులో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ 5-0తో న్యుయెన్ తీ తమ్(వియత్నాం)పై అద్భుత విజయం సాధించింది. దీని ద్వారా వరుసగా రెండో ఏడాది జరీన్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది.
మరోవైపు గతంలో రెండుసార్లు కాంస్య పతకానికే పరిమితమైన లవ్లీనా బొర్గోహై ఈసారి తన పసిడి కలను సాకారం చేసుకుంది. 5-2 తేడాతో కైట్లిన్ పార్కర్(ఆస్ట్రేలియా)పై లవ్లీనా విజయం సాధించింది. ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరిగిన మెగాటోర్నీలో భారత్ తరఫున నిఖత్ జరీన్, లవ్లీనా బొర్గోహై, స్వీటీ బూర, నీతు గంగాస్ పసిడి పతకాలు సాధించారు. దీని ద్వారా 2006 తర్వాత భారత్ మరోమారు నాలుగు స్వర్ణాలు దక్కించుకుంది. పసిడి పతక విజేతలకు ప్రైజ్‌మనీ కింద ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య(ఐబీఏ) నుంచి రూ.82 లక్షల నగదు ప్రోత్సాహంతో పాటు ఈసారి కొత్తగా చాంపియన్‌షిప్ బెల్ట్ అందించారు.
పారిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని తన వెయిట్ క్యాటగీరీని మార్చుకున్న నిఖత్ అనుకున్న ఫలితాన్ని సాధించింది. ఆదివారం జరిగిన 50కిలోల తుదిపోరులో నిఖత్ అద్భుత పోరాట పటిమ కనబరిచింది. రెండుసార్లు ఆసియా చాంపియన్ న్యుయెన్ నుంచి దీటైన పోటీ ఎదురైనా వెరవకుండా తనదైన శైలిలో పోరాడింది. తొలి రౌండ్ నుంచే ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. తొలుత న్యుయెన్ దాడి ప్రారంభించగా, నిఖత్ ఆ తర్వాత పుంజుకుంది. రెండు రైట్హుక్స్కు తోడు స్ట్రెయిట్ జాబ్స్‌తో వియత్నాం బాక్సర్‌కు తన పంచ్ పవర్ చూపెట్టింది. అయితే రెండో రౌండ్లో న్యుయెన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. సూపర్ పంచ్‌లతో విరుచుకుపడటంతో నిఖత్ ఒకింత వెనుకంజ వేసినట్లు కనిపించింది. అయితే కీలకమైన మూడో రౌండ్లో ఇద్దరు బాక్సర్లు దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో రిఫరీ మందలింపునకు గురయ్యారు.
మహిళల ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో అద్భుత విజయంతో స్వర్ణ పతకం సాధించిన నిఖత్జరీన్కు హృదయపూర్వక అభినందనలు. ఉక్కు సంకల్పానికి, నైపుణ్యానికి నీ విజయం తార్కాణం. భవిష్యత్ తరాల ప్లేయర్లలో స్ఫూర్తి కల్గించేందుకు అద్భుత విజయాలు సాధిస్తూనే ఉండాలి.
– మంత్రి కేటీఆర్
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించిన నిఖత్జరీన్కు అభినందనలు. పవర్ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థిని మట్టికరిపించి పసిడి పతకం సాధించావు. వరుసగా రెండోసారి టైటిల్ గెలువడం గర్వకారణం. నీ ఘనతలు చూసి భారత్ గర్వపడుతుంది.
– మంత్రి హరీశ్‌రావు
బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్‌కు అభినందనలు. వరుసగా రెండో సారి నిఖత్ స్వర్ణం సాధించడం దేశానికి గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో నిఖత్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలి
– మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన నిజామాబాద్ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్‌కు అభినందనలు
– మంత్రి ప్రశాంత్‌రెడ్డి
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో జాతీయ పతాకం మరోమారు రెపరెపలాడింది. దేశం గర్వపడేలా పసిడి పతకం సాధించిన నీఖత్ జరీన్‌కు అభినందనలు
– ఎమ్మెల్సీ కవిత
బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించిన నిఖత్ జరీన్ తెలంగాణ ఆడబిడ్డలకు గర్వకారణం. సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో ప్రపంచ చాంపియన్‌గా నిలువడం సంతోషకరం.
-ఆంజనేయగౌడ్, సాట్స్ చైర్మన్