WPL: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి బంగారు బాతుగుడ్డులా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బాటలోనే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పయనించేందుకు సిద్ధమైంది. 16 సీజన్లుగా దేశవ్యాప్తంగానే గాక ప్రపంచ క్రికెట్ అభిమానులను తనవైపునకు తిప్పుకున్న ఐపీఎల్ విజయవంతం కావడానికి ఫ్రాంచైజీలు తమ సొంత నగరాలలో ఆడటమేనన్నది జగమెరిగిన సత్యం.
గతేడాది ఐపీఎల్లో పది జట్లు పాల్గొనగా హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు ఢిల్లీ, లక్నో, కోల్‌కతా, మొహాలీ, జైపూర్, అహ్మదాబాద్‌తో పాటు రాజస్తాన్ ఆడిన పలు మ్యాచ్‌లు గువహతి (అస్సాం)లో కూడా జరిగాయి. ఇప్పుడు ఇదే ఫార్ములా (హోం అండ్ అవే) ను డబ్ల్యూపీఎల్‌లో కూడా తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలుకాబోయే రెండో సీజన్లో ముంబైతో పాటు బెంగళూరులో కూడా మ్యాచ్‌లను నిర్వహించే దిశగా బీసీసీఐ పావులు కదుపుతోంది.
WPL likely to be played in home and away format and it’ll commence from 23rd February.
– Likely venues are Mumbai and Bangalore. (Women’s Criczone). pic.twitter.com/yrC2kwJPfm
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 8, 2023
డబ్ల్యూపీఎల్ లో కూడా హోం అండ్ అవే ఫార్ములా ప్రకారం మ్యాచ్‌లను నిర్వహిస్తామని, కానీ మూడు సీజన్ల తర్వాతే ఇలా జరిగే అవకాశమున్నట్టు బీసీసీఐ గతంలో వెల్లడించింది. అయితే తాజాగా బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. రెండో సీజన్‌ను ముంబైతో పాటు బెంగళూరులో కూడా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయకున్నా త్వరలోనే దీనిపై వివరాలు వెలువడే అవకాశాలున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ మొదటివారంలో డబ్ల్యూపీఎల్ వేలం జరగాల్సి ఉన్న నేపథ్యంలో అప్పుడు హోం అండ్ అవే నిర్ణయంపై స్పష్టత రావొచ్చని సమాచారం.