ముంబై: మహిళల క్రికెట్లో నూతన అధ్యాయం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరు ఊహించని విధంగా మహిళల ఐపీఎల్ జట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై కాసుల వర్షం కురిపించాయి. ఐదు జట్ల కోసం బుధవారం జరిగిన బిడ్డింగ్‌లో రికార్డు ధరలకు జట్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఐదు జట్ల కోసం రూ.4669 కోట్లు ఫ్రాంచైజీలు ఖర్చు చేశాయి. ఐపీఎల్లో జట్టు కొనుగోలు చేయడంలో విఫలమైన ప్రముఖ కార్పొరేట్ కంపెనీ అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎట్టకేలకు అహ్మదాబాద్ జట్టును ఏకంగా రూ.1289 కోట్లకు తీసుకోవడం ద్వారా తమ ఆగమనాన్ని ఘనంగా చాటిచెప్పింది. మిగతా ఫ్రాంజైలీ విషయానికొస్తే.. ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్(ముంబై, 913 కోట్లు), రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్(బెంగళూరు, 901 కోట్లు), జెఎస్డబ్ల్యూ జీఎమ్ఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు), క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్(లక్నో, 757 కోట్లు) జట్లను కొనుగోలు చేశాయి.
ముంబైలో జరిగిన బిడ్డింగ్‌లో ఐపీఎల్ నుంచి ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో ఫ్రాంజైజీలు డబ్ల్యూపీఎల్‌లోకి ప్రవేశించాయి. ఇందులో అదానీ కంపెనీ 1289 కోట్లతో అందరికంటే ఎక్కువ బిడ్డింగ్‌తో టాప్‌లో నిలిచింది. మొత్తం ఐదు జట్ల సమాహారంతో మార్చిలో వుమెన్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అభిమానుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే రూ.951కోట్లతో డబ్ల్యూపీఎల్ మీడియా ప్రసార హక్కులను రిలయన్స్ కంపెనీకి చెందిన వయాకామ్ 18 సంస్థ దక్కించుకుంది. దీని ద్వారా ఐపీఎల్ తర్వాత అత్యంత ఖరీదైన లీగ్‌గా డబ్ల్యూపీఎల్ నిలిచింది. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జైషా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్, ఉపాధ్యక్షుడు రాజీవ్‌శుక్లా తదితరులు పాల్గొన్నారు.
ఐదు జట్ల డబ్ల్యూపీఎల్ కోసం వచ్చే నెలలో ప్లేయర్ల వేలం పాట జరుగనుంది. ఇందులో ఒక్కో జట్టుకు రూ.12 కోట్ల చొప్పున పర్స్ కేటాయించారు. ఒక్కో జట్టులో కనీసంగా 15 మంది ప్లేయర్లు, గరిష్టంగా 18 మందిని తీసుకునే అవకాశముంటుంది.