హాంగ్జొ (చైనా) : మహిళల ఆసియా కప్ హాకీలో భారత జైత్రయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా ఆడుతున్న మన అమ్మాయిలు.. సూపర్-4 దశలో 4-2తో కొరియాను చిత్తుచేసి సెమీస్‌కు మార్గం సుగమం చేసుకున్నారు. బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో వైష్ణవి (2వ నిమిషంలో) ఆరంభంలోనే గోల్ కొట్టి భారత్‌ను ఆధిక్యంలోకి తెచ్చింది. వైష్ణవి.. పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచింది. మూడో క్వార్టర్ దాకా ఆ ఆధిక్యాన్ని కొనసాగించిన భారత్‌కు.. 33వ నిమిషంలో సంగీత కుమారి గోల్ చేసి మరింత పటిష్ట స్థితిలో నిలిపింది.
అయితే కొరియాకు దక్కిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యుజిన్ కిమ్ (33వ ని.) గోల్ చేసి భారత ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ 40వ ని.లో లాల్రెమ్సియామి అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత్ 3-1తో నిలిచింది. 53వ ని.లో యుజిన్ మరో గోల్ చేసినా.. ఆట ముగుస్తుందనగా 59వ ని.లో రుతుజ గోల్ చేయడం గమనార్హం. ఈ టోర్నీలో భారత్.. తమ తదుపరి మ్యాచ్‌లో చైనాతో తలపడనుంది.