దుబాయ్ : క్రికెట్ అభిమానులను ఫోర్లు, సిక్సర్ల జడివానలో ముంచెత్తడానికి మరో ప్రతిష్టాత్మక టోర్నీ సిద్ధమైంది. శుక్రవారం నుంచే మహిళల ఆసియా కప్‌నకు తెరలేవనుంది. టీ20 ఫార్మాట్లో దుబాయ్, యూఏఈ వేదికలుగా సెప్టెంబర్ 13 వరకు ఈ మెగా టోర్నీ జరుగనుంది. మొత్తం 8 జట్లు తలపడబోయే ఈ మెగా ఈవెంట్లో శ్రీలంక డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుండగా టోర్నీలో అత్యంత విజయవంతమైన జైట్టెన భారత్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. టోర్నీలోనే రసవత్తరమైన పోరుగా భావించే భారత్, పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 5న జరుగుతుంది. మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ (సోనీ లివ్ ఓటీటీ)లో ప్రత్యక్ష ప్రసారం చూడొచ్చు.
8 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ ఉండగా గ్రూప్-బీ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ, ఇండోనేషియా ఉన్నాయి. మొత్తం 15 మ్యాచ్‌లున్న ఈ టోర్నీలో 12 గ్రూప్ దశవి కాగా సెప్టెంబర్ 10, 11న రెండు సెమీస్‌లు నిర్వహించనుండగా 13న ఫైనల్ జరుగుతుంది. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన రెండు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. శుక్రవారం తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్, హాంకాంగ్ తలపడనున్నాయి. ఈనెల 30న థాయ్‌లాండ్ మ్యాచ్‌తో భారత్ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది.