Wimbledon | వింబుల్డన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో అన్‌సీడెడ్ మార్కెటా వొండ్రొసోవా (చెక్ రిపబ్లిక్) ఫైనల్‌కు దూసుకెళ్లింది. తద్వారా ఓపెన్ ఎరాలో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో వొండ్రొసోవా 6-3, 6-3తో ఎలీనా స్వితోలినాపై విజయం సాధించింది. వొండ్రొసోవాకు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కాగా.. క్వార్టర్స్‌లో టాప్ సీడ్ స్వియాటెక్‌ను మట్టికరిపించిన స్వితోలినా సెమీస్‌లో అదే జోరు కొనసాగించలేకపోయింది. గంటా 15 నిమిషాల పాటు సాగిన పోరులో 4 ఏస్‌లు బాదిన వొండ్రొసోవా 22 విన్నర్లు కొట్టింది.
మ్యాచ్ మొత్తంలో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయిన స్వితోలినా.. 9 విన్నర్లకే పరిమితమై మూల్యం చెల్లించుకుంది. మరో సెమీఫైనల్లో ఆరో సీడ్ జాబర్ 6-7 (5/7), 6-4, 6-3తో రెండో సీడ్ సబలెంకపై విజయం సాధించింది. 2 గంటలా 19 నిమిషాల పాటు సాగిన సెమీఫైనల్లో మూడు ఏస్‌లే కొట్టిన జాబర్.. కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చింది. మరోవైపు 10 ఏస్‌లు, 39 విన్నర్లతో ప్రత్యర్థి కన్నా ఎంతో ముందు నిలిచిన సబలెంక.. ఒత్తిడికి చిత్తైంది. శనివారం జరుగనున్న టైటిల్ పోరులో వొండ్రుసోవాతో జాబర్ అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ అల్కరాజ్తో పాటు మూడో సీడ్ మెద్వెదెవ్ కూడా సెమీఫైనల్లో అడుగుపెట్టారు.
బోపన్న జోడీ ఓటమి
పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భారత వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న జోడీ పరాజయం పాలైంది. ఆరో సీడ్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ జంట 5-7, 4-6 తేడాతో టాప్ సీడ్ వెస్లీ-నీల్ ద్వయం చేతి ఓడింది.