MS Dhoni Retirement | ఐపీఎల్ 18వ సీజన్‌కు రెండురోజుల్లో మొదలవనున్నది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి, ధనాధన్ ధోనీ ఇన్నింగ్స్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ప్రాక్టీస్‌లో స్సికర్లు, ఫోర్లు బాదడం ప్రాక్టీస్ చేస్తుండడం అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై సీఎస్కే మాజీ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ధోనీకి ఆటపై అంకిత భావంతోనే ఉన్నాడని.. రిటైర్కాకపోతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆటపై ప్రేమ తగ్గలేదని.. మక్కువ ఎప్పటికీ తగ్గుతుందని తాను అనుకోవడం లేదని.. అందుకే ఇప్పటికీ ఆడగలుగుతున్నాడని తెలిపాడు. ఈ వయసులోనూ వికెట్ల వెనుక చురుగ్గా ఉన్నారని.. ఈ నైపుణ్యం, మక్కువ ఉన్నప్పుడు ఆడకుండా ఆపాల్సిన అవసరం లేదని అనుకుంటున్నానని చెప్పాడు. ఈ సీజన్ చివరిలో రిటైర్మెంట్ ప్రకటించినా.. మరో నాలుగు సీజన్లు ఆడినా తానుమాత్రం ఆశ్చర్యపోనని చెప్పుకొచ్చాడు.
43 సంవత్సరాల ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇప్పటి వరకు ఐదు టైటిల్స్ గెలిచాడు. ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. గత సీజన్‌కు ముందు కెప్టెన్సీని వదులుకున్నాడు. దాంతో రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతని కెప్టెన్సీలో సీఎస్కే గత సీజన్లో ఐదోస్థానంలో నిలిచి.. ప్లేఆఫ్స్‌లో చోటు కోల్పోయింది. ధోనీ కొంతకాలంగా ఏడు, ఎనిమిది స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. మ్యాచ్ చివరి క్షణాల్లో మాత్రమే కనిపించి.. అద్భుతమైన షాట్లతో అలరించాడు. 2024 ఐపీఎల్ సీజన్లో ధోనీ స్ట్రయిక్ రేట్ 220 కంటే ఎక్కువ. 53.67 సగటుతో 161 పరుగులు చేశాడు. గత సీజన్లో ధోనీ గాయాలతో ఇబ్బందిపడ్డట్లు సమాచారం. ఈ సారి సీజన్లో ధోనీ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌పై ఉతప్ప స్పందిస్తూ.. ధోనీ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను చూశామని.. ఈ సారి కూడా ఏడు, ఎనిమిది స్థానాల్లో రావచ్చని చెప్పాడు. గతంలోనూ చివరిలో వచ్చి 12-20 బంతులు ఆడడం చూశామని గుర్తు చేశాడు.
మహేంద్ర సింగ్ ధోనీ 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఐదేళ్లు, అంతకంటే ముందు రిటైర్ అయిన ఆటగాడిని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తారు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సీఎస్కే ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా నిలుపుకుంది. ఐపీఎల్లో 2008 నుంచి ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటి వరకు 264 మ్యాచులు ఆడాడు. ఐపీఎల్లో 264 మ్యాచుల్లో 137.54 స్ట్రయిక్ రేట్.. 39.13 యావరేజ్‌తో 5243 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 84 పరుగులు కాగా.. ఐపీఎల్లో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.