బెంగళూరుతో తలపడనున్న సూపర్ కింగ్స్
ముంబై: డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి.. బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చెన్నై సూపర్ కింగ్స్..మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన చెన్నై.. మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో మిగిలిన పది మ్యాచ్‌ల్లో కనీసం ఎనిమిదింట నెగ్గితేనే ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలున్న తరుణంలో జడేజా సేన సర్వశక్తులు ఒడ్డాలని భావిస్తున్నది. సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందే మాస్టర్‌మైండ్ మహేంద్రసింగ్ ధోనీ పగ్గాలు వదిలేయడం.. జట్టుపై తీవ్ర ప్రభావం చూపినట్లు కనిపిస్తున్నది.
అంతర్జాతీయ క్రికెట్లో ఒక వెలుగు వెలుగుతున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. జట్టును గెలుపు బాట పట్టించడంలో మాత్రం విజయవంతం కాలేకపోతున్నాడు. ఐపీఎల్లో తలపండిన రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, డ్వైన్ బ్రేవో, ధోనీ, మోయిన్ అలీ సమిష్టిగా సత్తాచాటాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క దాంట్లో మాత్రమే రెండొందల పై చిలుకు పరుగులు చేసిన చెన్నై.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేయడంలో విఫలమైంది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాడిన పడకపోతే మరోసారి చెన్నైకి కష్టాలు తప్పకపోవచ్చు. బెంగళూరు విషయానికి వస్తే.. టాపార్డర్ జోరుమీదుండటం డుప్లెసిస్ సేనకు కలిసి రానుంది. విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, అనూజ్ రావత్, మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్‌తో బెంగళూరు బ్యాటింగ్ బలంగా కనిపిస్తున్నది.