మూడేండ్లుగా సెంచరీ మార్కు అందుకోవడం లేదని విమర్శల పాలవుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప మద్దతుగా నిలిచాడు. కోహ్లీ బాగా ఆడినప్పుడు నోరెత్తనివాళ్లు ఇప్పుడు అతడు ఇలా ఆడాలి, అలా ఆడాలి అని ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెస్ట్ తీసుకోవడం అతడి వ్యక్తిగత అంశమని అన్నాడు.
ఊతప్ప మాట్లాడుతూ.. ‘అతడు పరుగులు చేసినంత కాలం, సెంచరీలను మంచినీళ్ల ప్రాయంలా చేసినన్ని రోజులూ కోహ్లీ ఇలా ఆడాలి, అలా ఆడాలని ఎవరూ అనలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతీ ఒక్కరూ (విమర్శకులను ఉద్దేశిస్తూ) అతడికి సలహాలిస్తున్నారు. అతడు భారత్ తరఫున 70 సెంచరీలు చేశాడు. అందుకు మనం అతడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇప్పుడూ కోహ్లీ 30-35 పరుగులు చేయగలుగుతున్నాడు…’ అని అన్నాడు.
అంతేగాక కోహ్లీ విరామం తీసుకోవడంపై వస్తున్న విమర్శలపై ఊతప్ప స్పందిస్తూ.. ‘రెస్ట్ తీసుకోవడమనేది అతడి వ్యక్తిగత నిర్ణయం. అతడు విరామం తీసుకోవాలనుకుంటే తీసుకోనివ్వండి. కోహ్లీ మ్యాచ్ విన్నర్. అటువంటి ఆటగాడి శక్తిసామర్థ్యాల గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు..’ అని తెలిపాడు.
కోహ్లీతో పాటు భారత జట్టు భావి సారథుల గురించి కూడా ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు టెస్టులలో బుమ్రా, పరిమిత ఓవర్లలో కెల్ రాహుల్‌ను గానీ రిషభ్ పంత్‌ను గానీ సారథిగా నియమిస్తే బాగుంటుందని ఊతప్ప అన్నాడు.