న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓవర్ వెయిట్ కారణంగా.. రెజ్లర్ వినేశ్ పోగట్.. రెండో రోజు అనర్హురాలైంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌కు దూరమైంది. అధిక బరువు వల్ల వినేశ్.. చరిత్రను సృష్టించే అవకాశాన్ని చేజార్చుకున్నది. అయితే రెజ్లింగ్‌లో రెండు రోజులు వరుసగా బరువును చెక్ చేస్తారు. ప్రిలిమినరీ రౌండ్స్ రోజుతో పాటు ఫైనల్స్ జరిగే రోజు ఉదయం కూడా వెయిట్‌ను చెక్ చేస్తారు. ఇంతకీ రెజ్లింగ్‌లో వెయిట్ రూల్స్(Wrestling Weight Rules) ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
ఒలింపిక్స్‌లో ఈసారి వినేశ్ 50 కేజీల ఫ్రీ స్టయిల్లో పోటీపడింది. అయితే ప్రిలిమినరీ రౌండ్ రోజున ఆమె .. వెయిట్ లిమిట్ సరిగానే ఉన్నది. మంగళవారం జరిపిన బరువు కొలతలో ఆమె సక్సెస్ అయ్యింది. కానీ ఆ రోజు వరుసగా మూడు బౌట్స్ ఆడిందామె. ఇక రోజంతా ఆమె కొంత ఆహారాన్ని తీసుకున్నది. దీంతో వినేశ్ బరువు పెరిగినట్లు అంచనా వేశారు. రాత్రికి రాత్రే ఆమె రెండు కిలోల బరువు తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. వెయిట్ రూల్‌ను అందుకోవాలంటే ఆమె శ్రమించక తప్పలేదు.
ప్రత్యక్ష సాక్ష్యుల ప్రకారం.. నిన్న రాత్రి వినేశ్ పోగట్.. తీవ్రంగా శ్రమించింది. సెమీస్ మ్యాచ్ తర్వాత స్కిప్పింగ్ చేసింది. బరువు తగ్గేందుకు రాత్రంతా అన్ని ప్రయత్నాలు చేసింది. ఎంత ప్రయత్నించినా.. ఆమె మరో వంద గ్రాములు అధిక బరువు ఉన్నట్లు వెయిట్ టెస్టు టైంలో తెలిసింది.
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రూల్ బుక్ లోని ఆర్టికల్ 11 ప్రకారం.. ఒకవేళ ఎవరైనా అథ్లెట్.. తొలి రోజుతో పాటు రెండో రోజు కూడా ఒకే రకమైన వెయిట్‌ను చూపించలేని క్షణంలో.. ఆ అథ్లెట్‌ను కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. ఆ అథ్లెట్‌కు చివరి ర్యాంక్‌ను కేటాయిస్తారు. అయితే బరువు విషయంలో వినేశ్ విఫలమైంది. దీంతో ఆమెను పోటీ నుంచి అనర్హురాలిగా ప్రకటించారు. కనీసం సిల్వర్ మెడల్ గెలిచే అవకాశాన్ని కూడా ఆమె కోల్పోయింది.
50 కేజీల విభాగంలో ఇప్పుడు గోల్డ్ మెడల్‌ను ఒకరికి అందజేస్తారు. ఇద్దరికి కాంస్య పతకాలను ఇస్తారు.