ఢాకా: పిచ్ ఎంత స్పిన్నర్లకు సహకరించినా ఆరంభంలో కనీసం ఒకట్రెండు ఓవర్లు అయినా పేసర్లకు ఇవ్వడం ఆనవాయితీ. కానీ బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డేలో విండీస్ మాత్రం ఏకంగా 50 ఓవర్లనూ స్పిన్నర్లతోనే వేయించి వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఫార్మాట్లో 50 ఓవర్లూ స్పిన్నర్లే వేయడం ఇదే మొదటిసారి. ఇందుకు ఢాకా లోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికైంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో మొదట ఫీల్డింగ్ చేసిన కరీబియన్ జట్టు రెండు వైపుల నుంచీ స్పిన్ దాడితో ఆతిథ్య జట్టును కట్టడిచేసింది.
అకీల్ హోసెన్, రోస్టన్ చేజ్, పియారె, మొఠీ, అథనెజ్ తలా 10 ఓవర్ల చొప్పున 50 ఓవర్ల కోటాను పూర్తిచేయడం విశేషం. పలుగులు తేలి ఉన్న పిచ్‌పై స్పిన్నర్లు రాణించారు. గతంలో శ్రీలంక.. 1996లో ఇదే విండీస్‌పై ఆడిన మ్యాచ్‌లో 44 ఓవర్లను స్పిన్నర్లతో వేయించడమే ఇప్పటిదాకా ఈ ఫార్మాట్లో రికార్డు. ఇదిలాఉండగా ఈ మ్యాచ్‌లో ఇరుజట్లూ నిర్ణీత ఓవర్లలో 213 రన్స్ చేయడంతో ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా తేల్చాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో విండీస్ 10/1 స్కోరు చేయగా బంగ్లా 9/1 వద్దే ఆగిపోయి ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను విండీస్ 1-1తో సమం చేసింది.