గయానా: వెస్టిండీస్(West Indies)కు చెందిన ఓ క్రికెటర్పై లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. ఓ యువతిని అతను లైంగికంగా వేధించినట్లు గయానాలో ఫిర్యాదు నమోదు అయ్యింది. అయితే ఆ క్రికెటర్ మరో 11 మంది మహిళలను కూడా లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. ఆ క్రికెటర్ ఎవరన్నది వెల్లడించలేదు. అతను గయానాకు చెందినట్లు అంచనా వేస్తున్నారు. మైదానంలో ఓ రాక్షసుడు తిరుగుతున్నాడని గయానాకు చెందిన వార్తా సంస్థ ఓ కథనాన్ని రాసింది. ప్రస్తుతం అతను వెస్టిండీస్ జాతీయ జట్టులో ఆడుతున్నట్లు కూడా వెల్లడించారు. లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు ఉన్నా.. ఆ క్రికెటర్పై మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు కాలేదు.
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఆ ప్లేయర్ వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు క్రికెట్ బోర్డు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం విండీస్ జట్టులో అతనో కీలక ప్లేయర్ అని తెలిసింది. ఈ విషయం తమకు పూర్తిగా తెలియదని, కామెంట్ చేసే స్థితిలో లేమని విండీస్ బోర్డు ప్రెసిడెంట్ కిషోర్ షాలో తెలిపారు. 2024 జనవరిలో బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆ క్రికెటర్ ఆడినట్లు ఓ లాయర్ తెలిపారు. ఆస్ట్రేలియాపై విజయం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన సమయంలో అతనికి హీరో వెల్కమ్ ఇచ్చినట్లు కూడా చెప్పారు.