India vs England 1st Test | టీమిండియా–ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్నది. జూన్ 20న లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో శుక్రవారం నుంచి తొలి టెస్ట్ మొదలవనున్నది. ఇప్పటికే భారత జట్టు లీడ్స్ చేరగా.. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు హెడింగ్లీలోనే శిబిరం ఏర్పాటు చేసుకున్నది. ఈ నేపథ్యంలో హెడింగ్లీ పిచ్ స్వభావం ఎలా ఉంటుందనే దానిపై చర్చ మొదలైంది. లీడ్స్ గ్రౌండ్ హెడ్ రిచర్డ్ రాబిన్సన్ వివరాలు వెల్లడించారు. ‘ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉంది. ఫలితంగా మంచి బ్యాటింగ్ పిచ్ తయారైంది. తొలి రోజు పేసర్లకు సహకరిస్తే, ఆపై పిచ్ నెమ్మదిగా మారే అవకాశం ఉంది’ అని వెల్లడించారు. ఇంగ్లాండ్ జట్టు అనుసరిస్తున్న ‘బజ్‌బాల్’ ఆటశైలికి అనుకూలంగా ఉంటుందన్నారు. అయితే, ఈ పిచ్ యువ భారత బ్యాటింగ్ లైనప్‌కు పరీక్షగా మారవచ్చని రాబిన్సన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
గతంలో ఈ మైదానంలో భారత్ ఎక్కువగా మ్యాచ్‌లు ఆడకపోవడం, ఈసారి టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్ ఇక్కడే జరగడం విశేషం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో.. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ మ్యాచ్‌లో జడేజా, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు కీలక పాత్ర పోషించనున్నారు. యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్లకు కీలక అవకాశంగా మారనుంది. ఇదిలా ఉంగా.. తొలి టెస్టు ఇప్పటికే ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు పేస్ ఆల్‌రౌండర్లు, ఒకే ఒక స్పిన్నర్, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది. జాక్ క్రాలె, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జెమీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్‌కు జట్టులో చోటు కల్పించింది. మరో వైపు భారత జట్టు కూర్పుపై కసరత్తు చేస్తున్నది.