క్రీడాశాఖ సమీక్షలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: అపరిష్కృతంగా ఉన్న కోచ్‌ల క్రమబద్ధీకరణను పరిష్కరిస్తామని రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. గురువారం రవీంద్రభారతిలో క్రీడాశాఖపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. ముఖ్యంగా గత కొన్నేండ్లుగా సాట్స్‌లో సేవలందిస్తున్న కోచ్‌ల క్రమబద్ధీకరణ సమస్యపై ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజుతో చర్చించారు. సమస్య పరిష్కారం కోసం కోచ్‌ల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కొన్ని న్యాయ సమస్యలు ముడిపడి ఉన్నందున త్వరలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళుతామని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతిష్ఠాత్మకంగా స్టేడియాలను నిర్మిస్తున్నామన్నారు. నిర్మాణంలో ఉన్న క్రీడా మైదానాల పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే క్రీడాపాలసీని తీసుకురాబోతున్నామని అందుకు అనుగుణంగా సిద్ధం కావాలని మంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, సంయుక్త కార్యదర్శి రమేశ్, సాట్స్ డిప్యూటీ డైరెక్టర్ సుజాత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.