ముంబై: భారత మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ సంచలన విషయాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. సరిగ్గా 17 ఏండ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు జరిగిన ఉదంతాన్ని పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నాడు. ఆసీస్ పర్యటనలో ఒక ప్రముఖ నటితో డేటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ‘2007లో మేము ఆసీస్ టూర్‌కు వెళ్లినప్పుడు అదే సమయంలో బాలీవుడ్ నటి షూటింగ్ కోసం అక్కడికి వచ్చింది. అప్పటికే మంకీగేట్ వివాదంతో వాతావరణం చాలా ఉద్విగ్నంగా ఉంది. దీనికి తోడు ఆడిన రెండు టెస్టుల్లో విఫలమైన నేను ఒకింత ఒత్తిడిలో ఉన్నాను. ఫామ్‌లేమితో సతమతమవుతున్న నన్ను కలిసేందుకు ప్రయత్నించద్దంటూ ఆమెకు సూచించాను.
కానీ నన్ను ఫాలో అవుతూ కాన్‌బెర్రాకు వచ్చింది. ఇక్కడేం చేస్తున్నావంటూ ప్రశ్నిస్తే నీతో గడిపేందుకు వచ్చానంటూ సమాధానమిచ్చింది. ఆ రోజు రాత్రంతా సరదాగా గడిపాం. నేను కెరీర్‌పై దృష్టి పెడుతాను, నువ్వు కూడా సినిమాలు ఏంటో చూసుకోమని చెప్పాను. కాన్బెర్రా నుంచి అడిలైడ్ వెళ్లే సమయంలో నా సూట్‌కేసు కూడా ఆమె సర్దిపెట్టింది. అప్పుడు షూస్ కూడా ప్యాక్ చేయడంతో చేసేదేమి లేక ఆమె చెప్పులు వేసుకుని టీమ్ బస్ ఎక్కాల్సి వచ్చింది. ఇది చూసిన సహచర క్రికెటర్లు చప్పట్లతో ఆటపట్టించారు’ అని అన్నాడు. పలువురు హీరోయిన్లతో డేటింగ్ చేసిన యువీ 2016లో హజెల్కీచ్ను పెండ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.