ముంబై: ప్రపంచకప్ టోర్నీని ఎలాగైనా గెలువాలన్న పట్టుదలతో ఉన్న బీసీసీఐ అందుకు తగ్గట్లు అడుగులు వేస్తున్నది. స్వదేశం వేదికగా ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌తో పాటు వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రచిస్తున్నది. ఈనెల 1న జరిగిన రివ్యూ మీటింగ్‌తో దీనికి అడుగులు పడ్డాయి. ప్రస్తుత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వన్డే ప్రపంచకప్‌తో ముగుస్తున్నది. ద్రవిడ్ తర్వాత హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించాడు.