ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రాణించిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ పొట్టి క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడా..? మరో రెండునెలల్లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ.. ఈ ఫార్మాట్లో ఆడటం కష్టమేనా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. 33 ఏండ్ల కోహ్లీ ఇప్పటికే ఫామ్ కోల్పోయి తంటాలుపడుతున్న తరుణంలో ఈ నిర్ణయం అతడి అభిమానులకు మరింత బాధ కలిగించేదే అయినా బీసీసీఐ వర్గాల్లో మాత్రం ఇప్పుడిదే హాట్ టాపిక్.
కొంతకాలంగా మునపటి ఆట ఆడలేక తీవ్ర విమర్శల పాలవుతున్న విరాట్ కోహ్లీని టీ20ల నుంచి శాశ్వతంగా పంపించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే అదీ కోహ్లీతో చర్చించాకే..! ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్లో అతడు కొనసాగుతాడా..? లేదా..? అనేది తేలనుంది. ఈ మేరకు జాతీయ సెలక్షన్ కమిటీ కూడా కోహ్లీతో మాట్లాడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం.
మూడేండ్లుగా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేయలేదు. అదీగాక సుదీర్ఘ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్‌తో పాటు పొట్టి ఫార్మాట్లోనూ కోహ్లీ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. వన్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చే కోహ్లీ.. గత కొంతకాలంగా స్ట్రైక్ రొటేట్ చేయడానికి తప్ప తన మార్కును చూపించిన ఇన్నింగ్స్ ఆడిన సందర్భాలు చాలా తక్కువ. అసలు లేవని చెప్పినా అతిశయెక్తి కాదు.
కోహ్లీ నుంచి అభిమానులు 20, 30 లను కోరుకోవడం లేదు. అది అతడి స్థాయిని తగ్గించడమే. అదీగాక స్ట్రైక్ రేట్ కూడా నానాటికీ దారుణంగా పడిపోతున్నది. కీలక సందర్బాల్లో చెత్త షాట్లు ఆడి వికెట్ సమర్పించుకోవడం కోహ్లీ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. టీ20 క్రికెట్ పరిధి పెరగడంతో ఎక్కువ మ్యాచ్‌లు ఈ ఫార్మాట్లోనే ఆడాల్సి వస్తున్నది. అయితే కోహ్లీ ఆటతీరు మాత్రం టీ20లకు సరిపోయేట్టు లేదనేది సెలక్టర్లతో పాటు విమర్శకుల నుంచి వినిపిస్తున్న వాదన.
అయితే ఇప్పటికిప్పుడు కోహ్లీని తప్పిస్తే అది అతడితో పాటు జట్టుకూ చాలా నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. జట్టు కూర్పు కూడా దెబ్బతినే అవకాశాలున్నాయి. అందుకే సెలక్టర్లు కూడా పొట్టి ప్రపంచకప్ వరకు వేచి చూస్తున్నారు. అది ముగిశాక కోహ్లీతో సమావేశమై.. ఈ ఫార్మాట్లో అతడిని ఆడించాలా..? లేదా..? అనే విషయమై అతడితోనే చర్చించనున్నట్టు సమాచారం. ఈ సమాచారం కోహ్లీకి తెలియనది కాదు. మరి కోహ్లీ ఇకనైనా చెలరేగి అన్ని ఫార్మాట్లలో ఆడతాడా..? లేక ఏదో ఒక్క ఫార్మాట్‌కే పరిమితమవుతాడా..? అనేది కాలం నిర్ణయించనున్నది.