Virat Kohli | కొందరు తమలో సామర్థ్యం ఉన్నప్పటికీ కెరీర్లో ఎదగలేకపోతారు. మరికొందరు ట్యాలెంట్తోపాటు మరికొన్ని కారణాలతో సమున్నత స్థానాలకు చేరుతారు. ఒకప్పుడు అండర్ 19 వరల్డ్ కప్ (U-19 World Cup) సాధించిన భారత జట్టులో సభ్యులైన తన్మయ్ శ్రీవాస్తవ (35), అజితేశ్ అర్గల్ (37), విరాట్ కోహ్లీ (Virat Kohli) దీనికి నిదర్శనం. 2008లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో టీమ్మేట్స్. కోహ్లీ కెప్టెన్ కాగా, మిగిలిన ఇద్దరు టీమ్ఇండియా ట్రోఫీ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లీ ఇప్పటికీ భారత జట్టులో ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అజితేశ్ (Ajitesh Argal), తన్మయ్ (Tanmay Srivastava) మాత్రం దేశవాలీ క్రికెట్‌తోనే (Cricket) తమ కెరీర్‌ను ముగించారు. అయితే వారిద్దరు మరోసారి క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టారు. అయితే ఆటగాళ్లలా కాకుండా.. అంపైర్లుగా (Umpires). ఈ ఇద్దరు స్నేహితులు ప్రస్తుతం ఇండియా-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య జరుగుతున్న టోర్నీలో ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తున్నారు.
అర్గల్కు దేశవాలీ క్రికెట్లో తక్కువ అనుభవమే (10 మ్యాచులు) ఉన్నప్పటికీ, శ్రీవాస్తవ మాత్రం 90 దేశవాలీ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఇద్దరు 2023లో బీసీసీ అంపైరింగ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. దీంతో రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, ఐపీఎల్లో ఫీల్డ్ అంపైర్లుగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచులకు అంపైర్లుగా పనిచేస్తున్నారు. అయితే వీరిద్దరు ఐఐసీ మ్యాచ్‌లకు అంపైర్లుగా పనిచేయాలంటే ముందుగా ఐఐసీ ఎమిరేట్స్ ప్యానల్లో స్థానం సంపాదించాల్సి ఉంటుంది. అనంతరం ఎలైట్ ప్యానల్లో మెంబర్ అవ్వాలి. కాగా, భారత్ నుంచి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో ప్రస్తుతం నితిన్ మీనన్ మాత్రమే ఉన్నారు.
కోహ్లీ స్నేహితుడైన తన్మయ్ శ్రీవాస్తవ.. ఐపీఎల్ 2025 సీజన్లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో ఐపీఎల్లో ఆటగాడిగా.. అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలో అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన భారత యువ జట్టులో సభ్యుడైన తన్మయ్.. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 46 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ టోర్నీలో మొత్తం 6 మ్యాచ్‌ల్లో 262 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లెఫ్టార్మ్ బ్యాటర్ అయిన తన్మయ్ శ్రీవాస్తవ.. పార్ట్‌టైమ్ బౌలింగ్ చేసేవాడు.
ఉత్తరప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన తన్మయ్ శ్రీవాస్తవ 2008-09 సీజన్లో యూపీ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొత్తం 90 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 10 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 4918 పరుగులు చేశాడు. 44 లిస్ట్ A మ్యాచ్‌లలో 7 హాఫ్ సెంచరీలతో 1728 పరుగులు, 34 టీ20 మ్యాచ్‌లలో 649 పరుగులు నమోదు చేశాడు.
ఐపీఎల్లో తన్మయ్ 2008 నుంచి 2010 వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2011లో కొచ్చి టస్కర్స్ కేరళ, 2012లో డెక్కన్ చార్జర్స్ జట్టుకు ఆడాడు. అయితే ఐపీఎల్లో అతనికి పెద్దగా ఆడే అవకాశం రాలేదు. కేవలం 7 మ్యాచ్‌ల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించినా అవకాశాలు రాకపోవడంతో తన్మ శ్రీవాస్తవ 30 ఏళ్ల వయసులోనే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత అంపైర్‌గా శిక్షణ తీసుకున్నాడు. అతను బీసీసీఐ లెవెల్ 2 అంపైరింగ్ కోర్సును పూర్తి చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కోసం టాలెంట్ స్కౌట్‌గా, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో అండర్-16 ఫీల్డింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు.