Virat Kohli : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఛటేశ్వర్ పూజారా (Cheteshwar Pujara) భారత జట్టుపై చెరగని ముద్రవేశాడు. అత్యంత కష్టమైన మూడో స్థానంలో క్రీజులోకి వచ్చి వికెట్ల పతనాన్ని అడ్డుకొని టీమిండియాను ఒడ్డున పడేసిన వీరుడు అతడు. ఆస్ట్రేలియాపై అత్యుత్తమ బ్యాటింగ్ నైపుణ్యాలు కనబరిచి ‘నయావాల్’ ట్యాగ్‌కు వందపాళ్లు న్యాయం చేశాడీ మిస్టర్ ఫర్ఫెక్ట్. పునరాగమనం కోసం రెండేళ్లుగా ఎదురు చూసిన పుజారా ఇక చోటు కష్టమేనని తెలిసి వీడ్కోలు వార్తతో అందరిని తన ఆట గురించి చర్చించుకునేలా చేశాడు.
టాపార్డర్‌లో అలుపెరగని యోధుడిలా పోరాడి.. చిరస్మరణీయ విజయాల్లో భాగమైన ఈ సౌరాష్ట్ర బ్యాటర్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)సైతం టెస్టు స్పెషలిస్ట్ రిటైర్మెంట్పై స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపాడు. మూడో స్థానంలో ఆడి తనపై ఒత్తిడి తగ్గించినందుకు పూజారాకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా కోహ్లీ కృతజ్ఞతలు తెలియజేశాడు.
Virat Kohli’s warm message for Cheteshwar Pujara 🙌 pic.twitter.com/bJvyL61aS2
— ESPNcricinfo (@ESPNcricinfo) August 26, 2025
‘నాలుగో స్థానంలో నా పనిని తేలిక చేసినందుకు ధన్యవాదాలు పుజ్జీ. నీ కెరీర్ అద్భుతంగా సాగింది. భారత జట్టుకు విశేష సేవలందించి రిటైర్ అవుతున్న నీకు అభినందనలు. నీ తదుపరి ప్రయాణం గొప్పగా సాగాలని కోరుకుంటున్నా. ఆ దేవుడి అనుగ్రహం నీకు ఎల్లప్పుడు ఉంటుంది’ అని విరాట్ తన పోస్ట్‌లో పుజారాపై ప్రశంసలు కురిపించాడు. ఓపెనర్లు విఫలమైన తర్వాత ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను భుజాన వేసుకున్నారిద్దరూ. విరాట్, పుజారాలు 83 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 3,513 పరుగులు జోడించారు. ఏడు శతక, 18 హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారీ వెటరన్ ప్లేయర్లు.
జిడ్డు ఆటకు.. ఆపద్భాందవుడి పాత్రకు కేరాఫ్ అయిన రాహుల్ ద్రవిడ్ వారసుడిగా జట్టులోకి వచ్చిన పుజారా అనతికాలంలోనూ నయావాల్ అనిపించుకున్నాడు. తన పటిష్టమైన టెక్నిక్, చెక్కుచెదరని ఏకాగ్రతతో క్రీజులో పాతుకుపోయే అతడు బంతిని పాతబడేలా చేసి తర్వాతి బ్యాటర్ల పని తేలిక చేసేవాడు. అందుకే.. పుజారాను గొప్ప బ్యాటర్‌గా అభివర్ణిస్తారు మాజీ క్రికెటర్లు. మూడో స్థానంలో పుజారా ఆడినన్ని రోజులు భారత జట్టు సురక్షింతంగా ఉందని క్రికెట్ పండితులు వ్యాఖ్యానించడం అతడి సామర్ధ్యానికి కొలమానం.
రంజీల్లో పరుగుల వీరుడిగా సెలెక్టర్ల దృష్టిలో పడిన పుజారా 2010లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్‌నే తన అడ్డాగా మార్చుకున్న అతడు103 మ్యాచుల్లో 7,195 పరుగులు సాధించాడు. అవసరాన్ని బట్టి గేర్ మార్చగల పుజ్జీ.. 43.61 సగటుతో 19 సెంచరీలు, 35 అర్ధ శతకాలు బాదాడు.