ఇండోర్: భారత క్రికెట్‌కు మరో షాక్! ఇప్పటికే టెస్టుల్లో సొంతగడ్డపై అవమానకర ఓటములను మూటగట్టుకుంటూ ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్న టీమ్ఇండియా.. పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ అదే ఆటతీరును కొనసాగిస్తున్నది. స్వదేశంలో భారత ఆధిపత్యాన్ని తెరదించుతూ 2024 అక్టోబర్‌లో టీమ్ఇండియాపై టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి సంచలనం సృష్టించిన న్యూజిలాండ్.. తాజాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌నూ 2-1తో ఎగురేసుకుపోయి మరో షాకిచ్చింది. ఇరుజట్ల మధ్య ఇండోర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో కివీస్.. 41 పరుగుల తేడాతో మెన్ ఇన్ బ్లూను చిత్తు చేసింది.
డారిల్ మిచెల్ (131 బంతుల్లో 137, 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడగా గ్లెన్ ఫిలిప్స్ (88 బంతుల్లో 106, 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరుచేసింది. ఛేదనలో భారత్.. విరాట్ కోహ్లీ (108 బంతుల్లో 124, 10 ఫోర్లు, 3 సిక్స్) శతకంతో పోరాడినా టాపార్డర్ వైఫల్యంతో 46 ఓవర్లలో 296 వద్దే ఆగిపోయింది. నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) గెలుపుపై ఆశలు రేపారు. సిరీస్ ఆసాంతం రాణించిన మిచెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
5/2. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన న్యూజిలాండ్‌కు రెండో ఓవర్లో ఎదురైన పరిస్థితి అది. అర్ష్‌దీప్ తొలి ఓవర్లోనే నికోల్స్‌ను డకౌట్ చేస్తే రాణా తన తొలి బంతికే కాన్వే(5)ను ఔట్ చేశాడు. కానీ సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న మిచెల్, యంగ్ (30) జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. మిచెల్ పూర్తి నియంత్రణతో మరో కళాత్మక ఇన్నింగ్స్‌ను ఆడాడు. రాణా 13వ ఓవర్లో యంగ్.. జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగినా అతడి స్థానంలో వచ్చిన ఫిలిప్స్ జాగ్రత్తగా ఆడాడు. కుల్దీప్ 21వ ఓవర్లో బౌండరీతో మిచెల్ ఫిఫ్టీ పూర్తయింది.
నితీశ్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదిన ఫిలిప్స్ అతడే వేసిన 33వ ఓవర్లో సింగిల్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. జడేజా ఓవర్లో సింగిల్ తీసిన మిచెల్.. ఈ సిరీస్‌లో వరుసగా రెండో, గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడో శతకాన్ని నమోదుచేశాడు. ఇక ఆ తర్వాత ఫిలిప్స్ కూడా ధాటిగా ఆడి శతకాన్ని చేరువయ్యాడు. అర్ష్‌దీప్ 42వ ఓవర్లో ఫిలిప్స్ తన కెరీర్లో రెండో శతకాన్ని సాధించాడు. ఫిలిప్స్‌ను అర్ష్‌దీప్ ఔట్ చేయడంతో 219 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
రికార్డు ఛేదనలో భారత్ 45 రన్స్‌కే రోహిత్ (11), కెప్టెన్ గిల్ (23) వికెట్లను కోల్పోయింది. భారత్ భారీ ఆశలు పెట్టుకున్న శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) కూడా దారుణంగా నిరాశపరచడంతో ఆతిథ్య జట్టు 12.1 ఓవర్లలో 71/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కోహ్లీ, తెలుగు కుర్రాడు నితీశ్ (53) భారత ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. కోహ్లీ తన సహజ శైలిలో ఆడగా నితీశ్ అతడికి చక్కని సహకారం అందించాడు. లినాక్స్ ఓవర్లో సింగిల్‌తో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తయింది. మరో ఎండ్‌లో ఫోక్స్, ఫిలిప్స్ ఓవర్లలో వరుస సిక్సర్లు బాదిన నితీశ్ కూడా అర్ధ శతకాన్ని పూర్తిచేయడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ క్రిస్టియన్ క్లార్క్ రెండో స్పెల్‌లో నితీశ్‌ను ఔట్ చేసి భారత్‌కు షాకిచ్చాడు. కోహ్లీకి అండగా నిలుస్తాడనుకున్న జడేజా (12) ను లినాక్స్ బోల్తొ కొట్టించాడు.
భారత స్కోరు 178/6తో ఉండగా క్రీజులోకి వచ్చిన రాణా.. కోహ్లీకి పూర్తి సహకారమే అందించడమే గాక అతడున్నంత సేపు భారత్ మ్యాచ్‌ను గెలుచుకునేలా కనిపించింది. 37వ ఓవర్లో 200 మార్కును అందుకున్నా ఛేదించాల్సిన రన్‌రేట్ పెరుగుతుండటంతో కోహ్లీ వేగం పెంచాడు. ఫోక్స్ ఓవర్లో 6,4 రాబట్టాడు. అతడే వేసిన 40వ ఓవర్లో వన్డేల్లో విరాట్ 54వ సెంచరీని నమోదుచేశాడు. భారత విజయానికి 9 ఓవర్లలో 98 రన్స్ అవసరమన్న దశలో జెమీసన్ వేసిన 43వ ఓవర్లో రాణా, కోహ్లీ 21 రన్స్ పిండుకున్నారు.
ఫోక్స్ 44వ ఓవర్లో బౌండరీతో తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని అందుకున్న రాణా.. ఆ మరుసటి బంతికే నికోల్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. మ్యాచ్‌లో ఇదే టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత బాల్కే సిరాజ్.. కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాణా నిష్క్రమించినా కోహ్లీ క్రీజులో ఉండటంతో భారత్ విజయంపై ధీమాగానే ఉంది. క్లార్క్ 46వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన కోహ్లీ.. నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి మిచెల్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత ఓటమి ఖరారైంది.
న్యూజిలాండ్: 50 ఓవర్లలో 337/8 (మిచెల్ 137, ఫిలిప్స్ 106, అర్ష్‌దీప్ 3/63, రాణా 3/84); భారత్: 46 ఓవర్లలో 296 (కోహ్లీ 124, నితీశ్ 53, క్లార్క్ 3/54, ఫోక్స్ 3/77)