Gavaskar To Kohli | టెస్ట్ మ్యాచ్‌లో స్టంప్ ఔట్ కాకుండా ఉండాలంటే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సలహా తీసుకోవాలని టీం ఇండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చారు. కొద్ది రోజులుగా కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడడంలో విఫలం అవుతున్నాడు. ఎటువంటి లోపం లేకున్నా తరుచుగా ఆఫ్ స్టంప్ ఆవలి బంతులను ఆడబోయి ఔటవుతున్నాడు. కోహ్లీ ఈ బలహీనతను అధిగమించాలంటే సచిన్ సలహా తీసుకోవాలని గవాస్కర్ చెప్పాడు.
సచిన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి.. సలహా అడిగితే అద్భుతంగా ఉంటుందని తెలిపాడు. 2003-04 ఆస్ట్రేలియా టూర్లో సచిన్.. ఆఫ్‌సైడ్ బంతులను ఎదుర్కొన్న తీరును కోహ్లీ అడిగి తెలుసుకుంటే మంచిదన్నాడు. నాటి సిరీస్ మూడో మ్యాచ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాక మళ్లీ అలాంటి షాట్లు ఆడబోనని సచిన్ చెప్పాడని గవాస్కర్ గుర్తు చేశారు.
తర్వాత జరిగిన సిడ్నీ టెస్ట్‌లో ఆఫ్‌సైడ్ బంతులు వదిలేసి సచిన్ ఆడాడు. మిడాఫ్, స్ట్రైట్, ఆన్‌సైడ్ బంతుల్ని మాత్రమే ఆడి తొలి ఇన్నింగ్స్‌లో 241 పరుగులతో నాటౌట్, సెకండ్ ఇన్నింగ్స్‌లో 60 పరుగులతో నాటౌట్‌గా టెండూల్కర్ నిలిచాడు. కనుక కోహ్లీ కూడా అటువంటి నిర్ణయమే తీసుకోవాలని గవాస్కర్ సూచించాడు.