Virat Kohli : ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) లో భాగంగా ఇటీవల పాకిస్థాన్ (Pakistan) తో జరిగిన మ్యాచ్‌లో 157వ క్యాచ్ అందుకున్న విరాట్ కోహ్లీ (Virat Kohli) .. వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న భారత ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తన 299వ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. అప్పటిదాకా ఈ రికార్డు భారత జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ (Mohmed Azaharuddin) పేరిట ఉండేది. అజహరుద్దీన్ 334 మ్యాచ్‌లలో 156 క్యాచ్‌లు అందుకున్నాడు.
అయితే కోహ్లీ ఇవాళ అస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో తన క్యాచ్‌ల రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. 160వ క్యాచ్ అందుకోవడం ద్వారా ఆస్ట్రేలియా టీమ్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిష్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడం ద్వారా ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక క్యాచ్‌ల రికార్డు శ్రీలంక టీమ్ మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే పేరిట ఉంది.
మహేళ జయవర్ధనే అంతర్జాతీయ వన్డేల్లో మొత్తం 218 క్యాచ్‌లు అందుకున్నాడు. ఆ తర్వాత 160 క్యాచ్‌లతో రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇవాళ పాంటింగ్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. మరో క్యాచ్ అందుకుంటే వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రెండో ఆటగాడిగా కోహ్లీ కొత్త రికార్డు నెలకొల్పనున్నాడు.