Kaneria on Kohli | టీం ఇండియా మాజీ సారధి విరాట్ కోహ్లీపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా ఘాటు వ్యాఖ్యలు చేశాడు.టీం ఇండియా జట్టుకు కోహ్లీ భారంగా మారాడని వ్యాఖ్యానించాడు. రెండున్నరేండ్లుగా కోహ్లీ సరిగ్గా ఆడటం లేదు. విరాట్ కోహ్లీ తీరుపై ఫ్యాన్స్‌తోపాటు మాజీ క్రికెటర్లు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆయన ఆడే టెక్నిక్ మార్చుకోవాలని సలహా ఇస్తున్నారు.
మరికొందరు ఆటకు దూరంగా ఉండాలని అడ్వైజ్ చేస్తున్నారు. పనిలో పనిగా దానిష్ కనేరియా కూడా కోహ్లీపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సీనియర్లు లేకున్నా, ఇటీవల యువకులే కలిసి జట్టును గెలిపిస్తున్నారన్నాడు. కొంత కాలం ఆటకు దూరంగా ఉండి.. టీ-20 ప్రపంచ కప్ ముందైనా టీం ఇండియా జట్టులో చేరాలని అని ఓ యూ-ట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ అన్నాడు.
త్వరలోనే కోహ్లీ పరుగులు చేస్తారని ఫ్యాన్స్ చెబుతున్నారని కనేరియా గుర్తు చేశాడు. కానీ, కోహ్లీ ఐపీఎల్-2022 టోర్నీలో ఆడకుండా ఉండాలని తొలి నుంచి చెబుతున్నానన్నాడు. ఐపీఎల్‌కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాల్సిందని వ్యాఖ్యానించారు. టీ-20 ప్రపంచ కప్‌కు టీం ఇండియా సిద్ధం అవుతుంటే.. విరాట్ కోహ్లీ మాత్రం జట్టుకు భారంగా మారాడని వ్యాఖ్యానించాడు.