షార్జా: ఐపీఎల్14లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్థానం ముగిసింది. సోమవారం జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్‌లో ఆ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ సారధి విరాట్ కోహ్లీ భావోద్వేగ ట్వీట్ చేశాడు. ఈ ఐపీఎల్ రెండో దశ ప్రారంభమైనప్పుడే ఆర్సీబీ కెప్టెన్‌గా ఇదే తనకు చివరి టోర్నీ అని కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఎలాగైనా ఈ జట్టు కప్ కొట్టాలని ప్రతి అభిమానీ కోరుకున్నాడు.
కానీ షార్జా వేదికగా జరిగిన ఎలిమినేటర్‌లో ఫలితం తారుమారైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన భారీ స్కోరు చేయలేకపోయింది. విండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఆ జట్టు నడ్డి విరిచాడు. విలువైన కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్‌ల వికెట్లు కూల్చాడు. బ్యాటింగ్‌లో కూడా కోల్‌కతా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మూడు భారీ సిక్సర్లు బాది జట్టును గాడిలో పెట్టాడు. దీంతో ఆర్సీబీ ఓటమి మూటగట్టుకుంది.
ఈ నేపథ్యంలో ఆర్సీబీ సారధి విరాట్ కోహ్లీ భావోద్వేగ ట్వీట్ చేశాడు. ‘‘మేం కోరుకున్న ఫలితం ఇది కాదు. కానీ ఈ టోర్నీ అంతటా జట్టు కుర్రాళ్లు చూపిన క్యారక్టర్‌ను చూసి గర్విస్తున్నా. నిరుత్సాహపరిచే ముగింపే అయినా మేం తలవంచుకోవాల్సిన అవసరం లేదు. అభిమానులు, జట్టు మేనేజ్మెంట్, సపోర్ట్ సిబ్బంది అందరూ చివరి వరకూ ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు’’ అని కోహ్లీ ట్వీట్ చేశాడు.
అలాగే జట్టు సారధిగా, ఆటగాడిగా తాను చేయగలిగినంతా చేశానని ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం కోహ్లీ చెప్పాడు. తాను రిటైర్ అయ్యే వరకూ ఈ ఫ్రాంచైజీకే ఆడతానని వెల్లడించాడు.
Not the result we wanted but I am so proud of the character shown by the boys throughout the tournament. A disappointing end but we can hold our heads high. Thank you to all the fans, management & the support staff for your constant support. 🙏 @RCBTweets pic.twitter.com/VxZLc5NKAG
— Virat Kohli (@imVkohli) October 12, 2021