న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆటగాళ్లంతా సంబురాల్లో మునిగారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆనందోత్సాహాలతో దుమ్ము రేపారు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరింత జోష్లో మునిగాడు. పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాల్లోని ‘ఊ అంటావా మామ’, ‘నాటు నాటు’ పాటలకు చిందేశాడు.
ఈ సందడి వాతావరణానికి ఆర్సీబీ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్, విన్నీ రామన్ రిసెప్షన్ వేదికగా మారింది. మాక్స్వెల్, విన్నీ పెండ్లి జరిగి నెల రోజులు పూర్తవడంతో మంగళవారం సాయంత్రం ఆర్సీబీ ఘనంగా రిసెప్షన్ నిర్వహించింది. ఈ వేడుకలో సంప్రదాయ వస్ర్తాధారణలో కోహ్లీ, అనుష్క శర్మ జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో మహమ్మద్ సిరాజ్, దినేశ్ కార్తీక్ కూడా సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలను అనుష్కతో పాటు ఆర్సీబీ సోషల్ మీడియాలో పంచుకుంది.