హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధీనంలోని మున్సిపల్‌శాఖలో పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు సర్కార్ షాక్ ఇచ్చింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో భారీగా కోతలు విధించింది. వేతన సవరణ ద్వారా జీతాలు పెరుగుతాయని ఆశించిన కార్మికులను కోలుకోలేని దెబ్బతీసింది. వేతనాల్లో కోతలు విధిస్తూ ఇటీవల కాంగ్రెస్ సర్కార్ జారీచేసిన 1181 జీవో కార్మికవర్గాల్లో తీవ్ర ఆందోళన నింపింది. పురపాలకశాఖలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల పొట్టకొట్టేలా ఈ ఉత్తర్వులు ఉన్నాయని మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
పెరిగిన నిత్యావసరాల ధరలతో కుటుంబాన్ని పోషించడమే కష్టంగా మారిన తరుణంలో, జీతాలు పెంచాల్సిందిపోయి వేలల్లో కోతలు విధించడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని, పాత వేతనాలను పునరుద్ధరించడంతోపాటు సరైన సవరణలతో జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనబాట పడుతామని హెచ్చరిస్తున్నాయి.
30,946 మంది కుటుంబాల ఆవేదన
రాష్ట్రంలోని వివిధ పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో 30,946 మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కేసీఆర్ హయాంలో శానిటరీ ఇన్స్పెక్టర్, వర్క్ఇన్స్పెక్టర్, బిల్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసేవారికి నెలకు రూ.22,750 చెల్లించేవారు. ప్రతినెలా క్రమం తప్పకుండా వారికి వేతనాలు అందేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మున్సిపల్‌శాఖను సైతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనవద్దే పెట్టుకోవడం వల్ల తమ జీవితాలు బాగుపడుతాయని కార్మికులు ఆశించారు.
కానీ, ఇప్పుడు కేవలం స్కిల్డ్, అన్‌స్కిల్డ్ సిబ్బందిగా వర్గీకరించి వర్కర్లు, డ్రైవర్లుగా పేర్కొంటూ వారి వేతనాలను రూ.15,600, రూ. 16,600గా నిర్ణయించారు. గతంలో రూ.22,750 అందుకుంటున్న వర్ఇన్స్పెక్టర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాలను కొత్త ఉత్తర్వుల ప్రకారం రూ.16,600 లేదా రూ.19,500కి తగ్గించి చెల్లిస్తున్నారు. మున్సిపాలిటీల్లో శానిటేషన్, పబ్లిక్ హెల్త్వరర్లు, డ్రైవర్లకు రూ.16,600, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.15,600 చొప్పున మాత్రమే వేతనం వర్తింపజేస్తున్నారు. 10 నుంచి 25 ఏండ్లుగా పురపాలక సంఘాల్లో రాత్రీపగలు కష్టపడి పనిచేస్తున్న సీనియర్ సిబ్బందికి ఇది తీవ్ర అన్యాయమని కార్మికులు వాపోతున్నారు. ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్లు, సిస్టమ్ మేనేజర్లు, సిస్టమ్ అసిస్టెంట్లు, పబ్లిక్ హెల్త్ వరర్ల వేతనాల్లో ఎలాంటి మార్పు చేయకుండా పాత వేతనాలనే కొనసాగించారు.
జీవో 1181ను సవరించాలి
కాంగ్రెస్ సర్కార్ జూన్ 12న జారీ చేసిన జీవో 1181ని వెంటనే ఉపసంహరించుకోవాలి లేదా సవరించాలి. ఉద్యోగులు గతంలో పొందుతున్న వేతనాల కంటే తకువ కాకుండా చెల్లించాలి. మా అర్హతలు, పదేండ్లకుపైగా అందిస్తున్న సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకొని వేతనాలు పెంచాలి. రాష్ట్రవ్యాప్తంగా యూఎల్బీల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సాంకేతిక సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి సర్వీసులను క్రమబద్ధీకరించాలి. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒకే విధమైన సమాన వేతన విధానాన్ని వర్తింపజేయాలి.
– బస్వ వెంకన్న, తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ అర్బన్ సర్వీసెస్ అసోసియేషన్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు
త్వరలో సమ్మె తేదీలు ప్రకటిస్తాం
గతంలో చెల్లించిన వేతనాలను రికవరీ చేయాలని ఆడిట్ అధికారులు జారీచేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలి. ఏజెన్సీల కమీషన్ ఒక్కో జిల్లాల్లో ఒక్కోరకంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వేతన కోతలను ఉపసంహరించుకోవాలి. ఈ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్‌కు వినతిపత్రాలు అందజేశాం. ఈ నెలాఖరులోగా సర్కార్ స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ సేవలను నిలిపివేసి ఆందోళనబాట పడుతాం. సమ్మె తేదీలు ప్రకటిస్తాం.
– కూతురు నరేందర్‌రెడ్డి, తెలంగాణ మున్సిపల్‌శాఖ అవుట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
