Vinesh Phogat | ఢిల్లీ: ‘అనర్హత వేటు’ తర్వాత ఇప్పటివరకూ ఆ విషయమై ఎలాంటి ప్రకటనా చేయని వినేశ్ ఫోగాట్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ లేఖతో స్పందించింది. లేఖలో తన తల్లిదండ్రుల కష్టం, మనుగడ కోసం ఆమె సాగించిన పోరాటం, గత రెండేండ్లుగా మ్యాట్ లోపల, ఆవల ఎదుర్కున్న సవాళ్లు, ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆమె పడ్డ తపన గురించి రాసుకొచ్చింది. “ఒక చిన్న గ్రామంలో పసి వయసులో ఉన్నప్పుడు నాకు ఈ ఒలింపిక్స్, మ్యాట్ గురించి ఏమీ తెలియదు. సాధారణ అమ్మాయి కలలుగనే మాదిరిగానే నాకూ పొడవైన జడ పెంచుకోవాలని, స్నేహితులతో కాలక్షేపం చేస్తూ ఫోన్‌తో ఆడుకోవాలని మాత్రమే ఉండేది. మా నాన్న ఒక సాధారణ బస్ డ్రైవర్. ఆయనెప్పుడూ తన కూతురు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకునేవారు.
‘నువ్వు పైన విమానంలో వెళ్తుంటే నేను కింద బస్‌లో వెళ్తా’ అని నాతో చెబుతుండేవారు. ఆయనకున్న ముగ్గురి సంతానంలో నేనే చిన్నదాన్ని అవడం వల్ల నా మీద ఎక్కువ ప్రేమ చూపించేవారు. ఆయన కలను చూసి అప్పట్లో నేను నవ్వుకునేదాన్ని. మా నాన్న మా నుంచి వెళ్లిపోయినా ఆయన చెప్పిన మాటలు నా మదిలో నిలిచిపోయాయి. నా తల్లి తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించింది. తన పిల్లలు బాగా బతకాలని అందుకోసం ఆమె చేయగలిగినంత చేసింది. కానీ మా నాన్న చనిపోయిన కొన్నిరోజులకే తానూ తనువు చాలించింది. మా నాన్న కల నా మదిలో నాటుకుపోగా మా అమ్మా పోరాటం నాకు స్ఫూర్తినిచ్చింది. జీవన మనుగడ కోసం చేసిన పోరాటంలో చిన్ననాటి నా కల (పొడువు జడ, మొబైల్ ఫోన్) చెదిరిపోయాయి. కానీ నేనెప్పుడూ మా అమ్మ చూపిన బాటలోనే నడిచాను. గడిచిన ఏడాదిన్నర, రెండేండ్లుగా మ్యాట్ లోపల, బయట నా జీవితం ఊహించని మలుపులను తీసుకుంది. నా చుట్టూ నిజాయితీగా నాకు మద్దతు పలికినవాళ్లు నా కష్టకాలంలో అండగా నిలిచారు. వాళ్ల నమ్మకంతోనే నేను సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాను.
డాక్టర్ దిన్షా పర్దివాలా నాకు దేవుడు పంపిన వైద్యుడు. ఆయన నాకు మూడుసార్లు ఆపరేషన్ చేశారు. ఆయన వల్లే నేను త్వరగా కోలుకుని మ్యాట్‌పైకి రాగలిగాను. అలాగే నా కోచ్ వొల్లర్ అకొస్ నాకు ఎల్లవేళలా మద్దతుగా నిలిచారు. రెజ్లర్ల పోరాటం జరుగుతున్నప్పుడు 2023 మే 28న జరిగిన ఆందోళనలో భారత జాతీయ జెండా కిందపడి నలిగిపోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. ఒలింపిక్స్‌లో మువ్వన్నెల పతాక కీర్తిని రెపరెపలాడించాలని అప్పుడే భావించాను. ఇక ఆగస్టు 7న జరిగినదాని (ఫైనల్ పోరుకు ముందు) గురించి నేను ఎంత చెప్పాలనుకున్నా మాటలు రావడం లేదు. ఆ రాత్రి నేను బరువు తగ్గేందుకు తీవ్రంగా కృషి చేశాను. ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కానీ తుదిపోరుకు సమయం తక్కువగా ఉండటం వల్ల నేను కాలంతో పరిగెత్తలేకపోయాను. ఇది పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా. నేను 2032 ఒలింపిక్స్ దాకా కొనసాగాలని కోరుకున్నా. కానీ నేను భవిష్యత్‌ను అంచనా వేయలేను. నాకు తెలిసిన, నేను నమ్మిన విషయం ఏమిటంటే నేను నమ్మిన దాని కోసం నిత్యం పోరాడుతూనే ఉంటాను’ అని లేఖలో వివరించింది.
వినేశ్ చరిత్ర సృష్టించింది
వినేశ్ ఫోగాట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల బృందంతో సమావేశమైన సందర్భంగా మోదీ స్పందిస్తూ.. ‘రెజ్లింగ్‌లో ఫైనల్‌కు చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. అది మనందరమూ గర్వించాల్సిన విషయం’ అని అన్నారు.