పారిస్: భారత కుస్తీ యోధురాలు వినేశ్ ఫోగాట్ ‘అనర్హత వేటు’పై తీర్పు మరోసారి వాయిదా పడింది. పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో ఫైనల్ చేరిన వినేశ్.. సరిగ్గా తుదిపోరుకు కొన్ని గంటల ముందు నిర్దేశిత బరువు కంటే వంద గ్రాములు అధికంగా ఉండటంతో ఒలింపిక్ నిర్వాహకులు ఆమెపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో సెమీస్‌లో తన చేతిలో ఓడినా ఫైనల్లో పోటీపడ్డ క్యూబా రెజ్లర్ లొఫెజ్తో కలిసి తనకూ రజతం ఇవ్వాలని కోరుతూ వినేశ్.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (కాస్)ను ఆశ్రయించింది. ఈ కేసులో గడిచిన వారం రోజులుగా వాదోపవాదాలు వింటున్న కాస్ తీర్పును ఈనెల 16కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) మంగళవారం వెల్లడించింది. వినేశ్ కేసును వాయిదా వేయడం ఇది మూడోసారి. ఈనెల 7న ఆమె కాస్‌లో అప్పీల్ చేయగా అదే రోజు తీర్పు వస్తుందని భావించినా అది కాస్తా ఈనెల 11కు వాయిదా పడింది. ఆ తర్వాత దానిని 13 నుంచి తాజాగా మరోసారి 16కు పొడిగించడం గమనార్హం.
వినేశ్ పతకం విషయంలో సందిగ్ధత కొనసాగుతున్నా ఆమెకు స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్‌గానే స్వాగతం పలుకుతామని ఆమె బంధువు మహావీర్ ఫోగాట్ అన్నారు. ‘కాస్ తీర్పు కోసం మేం వారం రోజులుగా వేచి చూస్తున్నాం. ఆమెకు రజతం దక్కుతుందని ఆశిస్తున్నాం. ఆమెకు ఏ పతకం వచ్చినా మేం మాత్రం ఆమెను పసిడి పతక విజేతగానే భావించి ఆ స్థాయిలోనే ఘన స్వాగతం పలుకుతాం. అంతేగాక ఆమె రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని లాస్ ఏంజెల్స్ (2028)లో పాల్గొనేలా ఒప్పిస్తాం’ అని తెలిపారు.
వినేశ్ అనర్హత వివాదంపై భారత మాజీ హాకీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ స్పందిస్తూ.. “ఈ వ్యవహారంలో రెండు విషయాలున్నాయి. ఒకటి ఒక అథ్లెట్ ఫైనల్ చేరారంటే వాళ్లకు కచ్చితంగా ఏదో ఒక మెడల్ ఇవ్వాలి. మా కాంస్య పోరు మ్యాచ్‌కు ముందు నేను ఆమెను కలిశాను. అప్పుడు వినేశ్ నాతో ‘భయ్యా. గుడ్ లక్. బాగా ఆడండి’ అని చెప్పింది. ఆమె నవ్వు వెనుక ఉన్న బాధను నేను అర్థం చేసుకోగలను. ఆమె నిజమైన యోధురాలు. రెండో విషయం ఏంటంటే ఒలింపిక్ రూల్స్‌పై అందరూ అవగాహన కలిగి ఉండాల్సిందే. ఆ విషయంలో ఫెడరేషన్‌కు, ఐవోసీ, ఐవోఏకు ఎలాంటి అవకాశామూ ఇవ్వకూడదు. ఇది అథ్లెట్లందరికీ గుణపాఠం. నియమ నిబంధనలనూ తూ.చా తప్పకుండా పాటించాలి” అని అన్నాడు.