భారత రెజ్లింగ్ చరిత్రలో సరికొత్త సంచలనం. గత రెండు ఒలింపిక్స్‌లలో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగి రిక్తహస్తాలతో వెనుదిరిగిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ‘పారిస్’లో మాత్రం ‘పసిడి పట్టు’కు సిద్ధమైంది. మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో ఫోగాట్ తనకంటే మెరుగైన ర్యాంకు కలిగిన, అసలు ఓటమంటేనే అర్థం తెలియని జపాన్ రెజ్లర్ యు సుసాకీకిని మట్టికరిపించిన ఆమె.. ఆ తర్వాత క్వార్టర్స్, సెమీస్‌లోనూ గెలిచి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తద్వారా ఈ ఎడిషన్‌లో భారత్‌కు నాలుగో పతకం అందించేందుకు సిద్దమైంది. అంతేగాక ఇప్పటిదాకా వచ్చిన మూడు కాంస్యాలకు భిన్నంగా స్వర్ణం లేదా రజతం సొంతం చేసుకునే అద్భుత అవకాశం ఆమె ముందుంది. మొదలు సుసాకీని, క్వార్టర్స్‌లో యూరోపియన్ మాజీ చాంపియన్ ఒక్సానా లివాచ్‌ను ఓడించిన ఆమె సెమీఫైనల్స్‌లో క్యూబా రెజ్లర్ జుమాన్ లోపెజ్‌ను ఓడగొట్టింది.
vinesh phogat | పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ సంచలన ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. గతేడాది దేశ క్రీడారంగంలో ‘వార్త’గా నిలిచిన ఆమె తన బాధనంతా పంటికింద బిగపట్టి విశ్వక్రీడల్లో అత్యద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. మంగళవారం మహిళల ఫ్రీస్టయిల్ 50 కిలోల సెమీఫైనల్స్‌లో ఫోగాట్.. 5-0తో యుస్నెలిస్ గుజమన్ (క్యూబా)ను ఓడించి స్వర్ణ పతక రేసులో నిలిచింది. తద్వారా తాజా ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం లేదా రజతం అందించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు భారత్‌కు మూడు కాంస్య పతకాలు రాగా అవి షూటింగ్లో వచ్చినవే. రెజ్లింగ్ ఫైనల్ చేరడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేశ్ నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్ నుంచి ఈ క్రీడల్లో ఆడుతున్న ఫోగాట్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. బుధవారం జరిగే ఫైనల్లో ఆమె యూఎస్ఏకు చెందిన హిల్డెబ్రండ్ట్ సారాతో అమీతుమీ తేల్చుకోనుంది.
ఏడాదంతా పోరాటాలు, ఆందోళనలు, వివాదాల నడుమ పారిస్ బరిలో నిలిచిన వినేశ్‌కు తొలి బౌట్‌లోనే సుసాకీ వంటి దీటైన ప్రత్యర్థి ఎదురైంది. ప్రపంచ 60వ ర్యాంకర్ అయిన ఆమెకు ఇటీవల కాలంలో ఫామ్ అంతంతమాత్రమే కాగా ఈ మ్యాచ్‌కు ముందు వరల్డ్ నంబర్‌వన్ ర్యాంకర్, అంతర్జాతీయ కెరీర్లో అసలు ఓటమన్నదే లేని సుసాకీతో వినేశ్ పోటీ అంటే అందరూ జపాన్ అమ్మాయే ఫేవరేట్ అనుకున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు అంతర్జాతీయ రెజ్లింగ్ కెరీర్లో సుసాకీ రికార్డు 82-0. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం, నాలుగు సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన ఘనమైన రికార్డు ఆమెకుంది. కానీ సుసాకీకి తొలిసారి పరాభవాన్ని పరిచయం చేస్తూ వినేశ్ సంచలనం సృష్టించింది. తన అనుభవన్నంతా రంగరించి ‘పట్టు’దలతో ఆమె చేసిన పోరాటానికి సుసాకీ తలొంచక తప్పలేదు.
తొలి బౌట్ 90 సెకన్ల పాటు ఇరువురూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు యత్నించారు. దీంతో సుసాకీ వ్యూహం మార్చి దూకుడు పెంచింది. రెండో బౌట్ సగం ముగిసేదాక వినేశ్ 0-2తో వెనుకబడే ఉంది. కానీ మరో 20 సెకన్లలో ఆట ముగుస్తుందనగా మొదలైంది అసలు కథ. సుసాకీ ఎడమ కాలును ఉడుము పట్టినట్టు పట్టిన వినేశ్ ఆమెను మ్యాట్‌పై పడేసింది. అంతే..! 3-2తో మ్యాచ్ గెలిచిన వినేశ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. సుసాకీతో మ్యాచ్‌లో ఇచ్చిన గెలుపుతో వినేశ్ క్వార్టర్స్‌లో రెచ్చిపోయింది. రెండో మ్యాచ్‌లో 7-5తో ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్నూ మట్టికరిపించి సెమీస్‌కు అర్హత సాధించింది.
కీలక సెమీస్‌లోనూ వినేశ్ దూకుడు చూపించింది. ఆత్మవిశ్వాసంతో మ్యాట్‌పైకి వచ్చిన ఆమె.. బౌట్ ఆరంభమైన కొద్దిసేపటికే ప్రత్యర్థిని కింద పడేసి హాఫ్ టైమ్ ముగిసేసరికి 2 పాయింట్లు సాధించి ఆధిక్యంలో నిలిచింది. రెండో బౌట్లో జుమాల్ రెండు కాళ్ల మధ్య అష్టదిగ్బంధనం వేసినట్టుగా మంత్రం వేయడంతో జుమాల్ ఆ పట్టును విడిపించుకోలేక చతికిలపడింది.
1 ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో మహిళల విభాగంలో ఫైనల్ చేరిన తొలి రెజ్లర్.
2 సాక్షి మాలిక్ తర్వాత ఒలింపిక్ పతకం గెలువబోతున్న రెండో ప్లేయర్
3 ఈ క్రీడలో సుశీల్ కుమార్, రవి దహియా తర్వాత ఫైనల్స్‌కు అర్హత సాధించిన మూడో రెజ్లర్.