PT Usha | న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో అధిక బరువుతో అనర్హత వేటుకు గురైన స్టార్ వినేశ్ ఫోగాట్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతూనే ఉన్నది. వినేశ్ బరువు విషయంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ దిన్శా పార్దివాలాను తప్పుపడుతున్న వేళ..జాతీయ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష తీవ్ర స్థాయిలో స్పందించింది. బరువు బాధ్యత అనేది అథ్లెట్లు, కోచ్‌లు చూసుకోవాల్సిందని, ఇందులో డాక్టర్ల ప్రమేయం ఏమి లేదని స్పష్టం చేసింది. ‘రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో లాంటి వెయిట్ మేనేజ్మెంట్ క్రీడల్లో బరువు నిర్దేశిత స్థాయిలో ఉన్నది చూసుకోవాల్సింది అథ్లెట్లు, కోచ్‌లు మాత్రమే. ఏదైనా గాయాలైతే వైద్యులు చికిత్స అందిస్తారు తప్ప.. బరువు విషయంలో వారికి ఎలాంటి పాత్ర ఉండదు’ అని పేర్కొంది. 100 గ్రాముల అధిక బరువుతో వినేశ్ తాను పోటీలో ఉన్న 50కిలోల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్‌కు అర్హత కోల్పయిన సంగతి తెలిసిందే.
వినేశ్ ఫోగాట్ అనర్హత వేటుకు గురి కావడంపై ఆమె లీగల్ టీమ్ పలు కారణాలను అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానం(సీఎస్ఏ) ముందుకు తీసుకువచ్చింది. ‘అథ్లెటిక్స్ విలేజ్ నుంచి రెజ్లింగ్ పోటీలకు వేదికైన చాంప్ డీ మార్స్ ఎరీనాకు చాలా దూరం ఉంది. దీని వల్ల సరైన టైమ్‌లో బరువు తగ్గించుకోలేకపోయింది. దీనికి తోడు బౌట్ల మధ్య సరైన సమయం లేకపోవడంతో బరువు తగ్గించుకునేందుకు చాన్స్ లభించలేదు. అయినా శరీర బరువులో 100 గ్రాములు అంటే చాలా తక్కువ. ఉక్కపోత, వేసవి వాతావరణ నుంచి తట్టుకునేందుకు శరీరానికి నీరు అవసరమవుతుంది. ఒకే రోజు మూడు పోటీల్లో తలపడటం వల్ల మజిల్ మాస్ పెరుగుతుంది. బౌట్ ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవాల్సి వస్తుంది’ అని పేర్కొంది.
మంగళవారం ఫోగాట్ కేసులో సీఏఎస్ తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నా యి. వినేశ్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు.