Faiz Fazal : భారత క్రికెట్లో ఒక్కొక్కరుగా ఆటకు అల్విదా పలుకుతున్నారు. బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ (Manoj Tiwary) రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే విదర్భ ఓపెనర్ ఫయజ్ ఫజల్( Faiz Fazal) కూడా ప్రొఫెషన్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. హర్యానాతో మ్యాచ్ ముగిశాక ఫజల్ ఆటకు గుబ్ చెప్పేశాడు. దాంతో, 21 ఏండ్ల అతడి సుదీర్ఘ కెరీర్‌కు తెరపడింది. ఫజల్ తన రిటైర్మెంట్ గురించి హింట్ ఇస్తూ ఫిబ్రవరి 28వ తేదీన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు.
అందులో.. ‘రేపు నేను నాగ్‌పూర్ మైదానంలో చివరిసారిగా అడుగుపెట్టబోతున్నా. రేపటితో ఒక అధ్యాయం ముగియనుంది. 21 ఏండ్ల క్రితం ఇక్కడే నా ఫస్ల్ క్లాస్ కెరీర్ మొదలైంది’ అని రాసుకొచ్చాడు. అంతేకాదు తన జర్నీ ఒక మర్చిపోలేని అనుభవమని ఫజల్ అన్నాడు. ‘ఇన్నేండ్ల ప్రయాణంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి.
భారత జట్టుకు, విదర్భకు ప్రాతినిధ్యం వహించడం జీవితంలో నాకు లభించిన గొప్ప గౌరవం’ అని ఫజల్ వెల్లడించాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ విదర్భ తరఫున లిస్ట్ ఏ, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించాడు. ఆ జట్టుకు ఆడిన వాళ్లలో టాప్ స్కోరర్‌గా కెరీర్ ముగించాడు.
రంజీ ట్రోఫీతో విదర్భ జట్టు
ఫజల్ సారథ్యంలోనే విదర్భ జట్టు 2017-18లో రంజీ చాంపియన్‌గా నిలిచింది. టోర్నీ చరిత్రలోనే తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. ఆ మరుసటి సీజన్లో ఫజల్ సేన డిఫెండింగ్ చాంపియన్‌గా టైటిల్ నిలబెట్టుకుంది. రంజీల్లో నిలకడగా రాణించిన అతడు 30 ఏండ్ల వయసులో టీమిండియాకు ఎంపికయ్యాడు. 2016లో జింబాబ్వే పర్యటనకు సెలెక్టర్లు పంపిన రెండో జట్టులో ఫజల్‌కు చోటు దక్కింది. అక్కడ హరారేలో జరిగిన మూడో వన్డేలో అతడు అరంగేట్రం చేశాడు. హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫజల్ 137 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 9,183 రన్స్ కొట్టాడు. అతడి ఖాతాలో 24 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్ ఏలో ఈ లెఫ్ట్ హ్యాండర్ 1,273 పరుగులు చేశాడు.